బ్లాక్ బాబుల‌కు మోడీ లాస్ట్ ఛాన్స్‌

దేశ వ్యాప్తంగా న‌ల్ల కుబేరుల‌పై క‌రెన్సీ స్ట్రైక్స్ తో విరుచుకుప‌డిన‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. బ‌డా బాబులు, బ్లాక్ బాబుల‌కు కంటిపై కునుకు లేకుండా చేశారు.  దీంతో అనేక మార్గాలు ఆలోచించిన న‌ల్ల‌కుబేరులు త‌మ వ‌ద్ద ఉన్న బ్లాక్ మ‌నీని మార్చుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. బ్యాంకు మేనేజ‌ర్ల‌కు 30 నుంచి 40% క‌మీష‌న్ ఇస్తున్నారు. అనుచ‌రుల‌కు ఫిఫ్టీ ఫిఫ్టీ ప‌ద్ధ‌తిలో ల‌క్ష‌లు అప్ప‌గించారు. అయినా త‌ర‌గ‌ని నోట్ల‌తో త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌రోప‌క్క ఐటీ త‌న నిఘాను తీవ్రం చేసింది. పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ దాడులు చేస్తున్నారు.

ఈ నెల 8 వ తేదీ ముందు వ‌ర‌కు డ‌బ్బులేని వాడు ద‌రిద్రుడు అన్న ప‌రిస్థితి తిర‌గ‌బ‌డి… ఇప్పుడు డ‌బ్బున్న‌వాడు ద‌రిద్రుడు అనే ప‌రిస్థితి దాపురించింది. ప్ర‌ధాని మోడీ అన్న‌ట్టు నిద్ర కోసం మాత్ర‌లు మింగినా అవి కూడా ప‌నిచేయ‌డం లేద‌ట కొంద‌రికి! ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేయ‌డంతో క‌రెన్సీ క‌ట్ట‌లు క‌ద‌ల‌క కుబేరులు క‌ల్లోల‌ప‌డిపోతున్నారు. ఈ క్ర‌మంలో వీరి క‌ష్టాలు గ‌మ‌నించిన ప్ర‌ధాని మోడీ వీళ్ల‌కి మ‌రో ఛాన్స్ ప్ర‌క‌టించారు. దీనిలో మాయా లేదు! మ‌ర్మం లేదు.. అంటూ ప్ర‌ధాని మోడీ ప్లాన్‌ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివ‌రించారు.

డిసెంబరు 30 లోపు న‌ల్ల‌కుబేరులు.. ఎవరికి వారు తమ వద్దనున్న బ్లాక్ మనీని స్వచ్ఛందంగా ప్రకటిస్తే.. దీనిపై 50% వరకూ పన్ను చెల్లించి బయట పడొచ్చన్న అభయాన్ని ఇస్తున్నారు. ఈ 50% లో జరిమానా.. సర్ ఛార్జీలు ఉన్నాయి. అయితే, ఈ విధానంలో చిన్న మెలిక ఏమిటంటే.. తాము ప్రకటించిన నల్లధనంలో 50% కేంద్రానికి పోగా.. మిగిలిన 50%లో 25% కేంద్రం వద్ద నాలుగేళ్ల పాటు ఉండిపోనుంది.

తర్వాత ఆ మొత్తానికి ఎలాంటి వడ్డీ లేకుండా తిరిగి తీసుకునే వీలుంది. మ‌రి ఈ ప్ర‌పోజ‌ల్ ఏదో బాగానే ఉంద‌ని అంటున్నారు ఫైనాన్స్ ఎడ్వైజ‌ర్లు. మ‌రి ఇప్ప‌టికైనా న‌ల్ల‌కుబేరులు దీనిని ఫాలో అవుతారో లేదో చూడాలి. ఒక‌వేళ ఈ ప్ర‌పోజ‌ల్‌కి కూడా వీళ్లు త‌లొగ్గ‌క‌పోతే.. ఐటీ రంగంలోకి దిగి.. 85% జ‌ప్తు చేసి జ‌రిమానాలు కూడా విధించే ఛాన్స్ ఉంది. సో.. ఇప్ప‌టికైతే.. మోడీ.. ఇచ్చిన ఛాన్స్ బాగానే ఉంద‌నే టాక్ వ‌స్తోంది.