పవన్ ఎంట్రీతో అక్కడ టీడీపీకి చుక్కలే

రాష్ట్ర విభ‌జ‌న తరువాత ఇటు ఏపీలోను, అటు తెలంగాణ‌లోను విభిన్న‌మైన రాజ‌కీయ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తెలంగాణ‌కు సంబంధించినంత‌వ‌ర‌కూ సినీ గ్లామ‌ర్ అంత‌గా ప‌నిచేయ‌ద‌నే చెప్పాలి. అక్క‌డ స్థానిక స‌మ‌స్య‌లు, నాయ‌కులే పార్టీల గెలుపు ఓట‌మిల‌ను ప్ర‌భావితం చేసే ప‌రిస్థితి గ‌తంలో ఉండ‌గా.. ఇక ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ ప్రాంతీయ‌వాదం భుజాన వేసుకుని.. అదే విధ‌నాన్ని కొన‌సాగిస్తూ… అక్క‌డి రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి చేరింది.

ఇక ఏపీలో సినీ గ్లామ‌ర్‌తో పాటుగా కుల రాజ‌కీయాల‌దే మొద‌టినుంచీ హ‌వా. విభ‌జ‌న త‌రువాత  అన్ని రాజ‌కీయ పార్టీలు రెండు రాష్ట్రాలలో ప్రత్యేక శాఖలు పెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిలో ప‌డ్డాయి. తెలుగుదేశం, వైసీపీలు అదే దారిలో ఉండగా, ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ సార‌థ్యంలోని జనసేన కూడా అదే బాట ప‌ట్టింది. ప‌వ‌న్ ఓట‌రుగా తన పేరు నమోదుకు ఏలూరును ఎంచుకోవ‌డంతో ఈ అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం దీనిపై మీడియాలో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

నిజానికి జ‌న‌సేన పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోయినా ఎన్నిక‌ల ఫ‌లితాలు టీడీపీకి అనుకూలంగా రావ‌డంలో త‌న‌దైన పాత్ర‌ను పోషించింద‌న్న‌ది రాజ‌కీయ నిపుణులు వెల్ల‌డించే అభిప్రాయం. తాజాగా జ‌న‌సేన అధినేత  రాజ‌కీయ కార్య‌క్షేత్రాన్ని త‌న సొంత జిల్లాకు మార్చుకోవాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో జ‌నసేన సొంతంగా పోటీ చేయ‌డ‌మే ఖాయ‌మైతే ఇక్క‌డ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఎలా మార‌బోతున్నాయి. ఇదే ఇప్పుడు ఆస‌క్తి క‌లిగిస్తున్నఅంశం. నిజానికి ప‌శ్చిమగోదావ‌రి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీకి కంచుకోట‌గా ఉంటూ వ‌చ్చింది. గ‌త ఎన్నికల్లోనైతే జిల్లాలోని అన్నిస్థానాలూ ఏక‌ప‌క్షంగా  తిరుగులేని మెజారిటీతో టీడీపీ ఖాతాలోకి చేరాయి.

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌డం, ప‌వ‌న్ జిల్లానుంచే పోటీ చేయ‌డం నిజమైతే ఈ జిల్లాలో టీడీపీ హ‌వాకు గండి పడ‌టం ఖాయ‌మ‌ని రాజకీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. కార‌ణ‌మేమంటే పశ్చిమ గోదావరిజిల్లాలో సహజంగానే కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన‌ ఓటుబ్యాంకు అధికం. ఆ సామాజిక వ‌ర్గంలోని యువ‌త‌లో అత్య‌ధిక శాతం పవన్‌ను  తమ రాజకీయ భవిష్యత్తుకు ధృవతారగా ప్రచారం చేసుకుంటున్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ విష‌యంలో ఎదురైన ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకుని  ముందునుంచే  కుల రాజ‌కీయాల‌ను ఖండిస్తూ “నేను ఏ కులానికి ప్రతినిధిని కాను, సమన్యాయానికి కట్టుబడి ఉంటాను” అంటూ అనేకసార్లు స్పష్టంగా చెబుతూ వ‌స్తున్నారు. నిజానికి ప‌వ‌న్‌కు మంచి వ్య‌క్తిగా మిగిలిన సామాజిక‌వ‌ర్గ‌ల్లోనూ మంచిపేరే ఉంద‌ని చెప్పాలి.  ఈ నేప‌థ్యంలో  జిల్లాలో టీడీపీ ప్రాబ‌ల్యానికి ప‌వ‌న్ రాజ‌కీయ ఎంట్రీతో గ‌ట్టి స‌వాల్ ఎదురు కానుందనే గుబులు టీడీపీ నాయ‌కుల అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో వ్యక్త‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.  సో… ప‌శ్చిమ‌లో పొలిటిక‌ల్ సినారియో ఎలా ఉండ‌బోతుందో స‌మీప భ‌విష్య‌త్తులో తేలిపోనున్న‌ద‌న్న‌మాట‌. రాజ‌కీయాల్లో మార్పు అన్న‌ది అత్యంత స‌హ‌జం మ‌రి..