తెలంగాణ కాంగ్రెస్ సారధి మారనున్నారా? ప‌్రస్తుత టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ పనితనంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉందా? ఆయనను మార్చి.. కాయకల్ప చికిత్స చేస్తేనే పార్టీ కి 2019లో మనుగడ ఉంటుందని భావిస్తోందా? అంటే ఔననే ఆన్సరే వినిపిస్తోంది. టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆకర్ష్ తో కాంగ్రెస్‌కి చెందిన హేమా హేమీలు హస్తానికి చెయ్యిచ్చి పార్టీ కండువాలు మార్చేశారు. ఈ క్రమంలో సమర్ధంగా వ్యవహరించి వాళ్లని పార్టీ మారకుండా నిలవరించే యత్నం చేయడంలో ఉత్తమ్ కుమార్ పూర్తిగా విఫలమయ్యారు.
ఇక, కేసీఆర్ పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా.. ప్రత్యక్ష యుద్ధం చేయడంలోను ఆశించిన మేరకు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలోను ఉత్తమ్ కుమార్ విఫలమయ్యారనే విమర్శలు పార్టీలోని నేతల నుంచే ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాల విభజన, మల్లన్నసాగర్ విషయాల్లోను ఆయన మిగిలి పక్షాల కన్నా వెనకబడ్డారనే అపఖ్యాతి తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై సొంత పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్.. తప్పని సరి పరిస్థితిలో టీపీసీసీ చీఫ్‌ను మార్చాలని డిసైడ్ అయింది.
ఈ క్రమంలోనే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, నల్లగొండ కోమటి రెడ్డి బ్రదర్స్‌లో వెంకటరెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ – హైదరాబాద్ కు చెందిన క్రికెటర్ అజహరుద్దీన్ లను కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి రమ్మనడమే కాకుండా రాబోయే మూడు రోజుల పాటు అందుబాటులో ఉండాలని సూచించింది. దీంతో పీసీసీ చీఫ్ మార్పుపై ఊహాగానాలు పెరిగిపోయాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ – పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ముగ్గురు నేతలతో వ్యక్తిగతంగా-వేర్వేరుగా సమావేశం కానున్నారని తెలుస్తోంది. అనంతరం వీరిలో ఎవరో ఒకరిని పీసీసీ చీఫ్‌ను చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలావుంటే, ఈ విషయం తెలిసిన వెంటనే తన పదవికి ఎసరు వస్తుందని నిశ్చయించుకున్న ఉత్తమ్ తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో ఆయన భేటీ కావాలని భావించారు. అయితే, గతం నుంచి వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు ఉన్నాయి. దీంతో ఆయనను కలిసి చర్చించేందుకు మనసు ఒప్పలేదో ఏమో.. ఉత్తమ్.. దిగ్విజయ్ అనుచరులను కలిశారట. ఇదేమంత వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదని సమాచారం. సో.. టీ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కి ఊస్టింగ్ ఖాయమని స్పష్టమైంది.