ఆ ఒప్పందాల‌తో చిరు సైకిలెక్కేస్తారా?

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు! అంతేకాదు, అస‌లు పాలిటిక్స్‌లో శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు. ఇప్పుడు ఇవ‌న్నీ ఎందుకంటే.. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న చిరంజీవి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌పై అనేక వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి కాబ‌ట్టి!! ప్ర‌జారాజ్యం పార్టీతో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చినా కాలం క‌లిసిరాక‌పోవ‌డంతో దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి ప్ర‌తిగా.. కేంద్రంలో మంత్రి ప‌ద‌వి కొట్టేశారు. ఆ త‌ర్వాత రాజ్య‌స‌భకు ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మ‌రో ఏడాదిన్న‌ర వ‌రకు ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ఉంది. అయితే, ఇప్ప‌టి నుంచే ఆయ‌న త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌పై ఓ నిర్ణ‌యానికి వ‌స్తున్న‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం ఉన్న ట్రెండ్‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవ‌డం అనేది క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌డంలేదు. దీంతో ఈ పార్టీనే న‌మ్ముకుని ఉంటే త‌న‌కు ఫ్యూచ‌ర్ ఉండ‌ద‌ని చిరు గ‌ట్టిగా డిసైడ్ అయ్యారు. ఈక్ర‌మంలో పార్టీ మార‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఆయ‌న అనుచ‌రుల స‌ల‌హా మేర‌కు టీడీపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే, ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. చిరు ఫ్యూచ‌ర్‌కి ఎలాంటి ఇబ్బందీ క‌ల‌గ‌ని రీతిలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు హామీ ఇస్తేనే చిరు సైకిలెక్కే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. ఆ ప్యూచ‌ర్ ఏంటంటే.. త‌న‌ను మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కి పంపించ‌డంతోపాటు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ఇప్పించాలి! ఇదీ ష‌ర‌తు!! మ‌రి దీనికి ఒప్పేసుకుంటే పార్టీ జెండా.. త‌న అజెండా మార్చేయ‌డానికి చిరు ఇప్పుడు సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం. లేనిప‌క్షంలో చిరును ఓ ఎమ్మెల్సీ చేసి స్టేట్ కేబినెట్‌లో కీల‌క పోస్టు ఇచ్చినా చిరు టీడీపీలో చేరేందుకు రెడీగా ఉన్నార‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. పార్టీలో సినీ గ్లామ‌ర్ మ‌రింత అవ‌స‌రం ఉంది. 2014లో ప‌వ‌ర్ స్టార్ భారీస్థాయిలో టీడీపీకి సాయం చేశారు. అప్ప‌ట్లో ఆయ‌న జ‌న‌సేన పార్టీ పెట్టుకుని కూడా పోటీకి వెళ్ల‌కుండా టీడీపీకి, చంద్ర‌బాబుకి ప్ర‌చారం చేశారు. అయితే, 2019లో పూర్తిస్థాయిలో ప‌వ‌న్ పోటీకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అంతేకాకుండా, ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో జ‌త‌క‌ట్టే యోచ‌న చాలా త‌క్కువ గానే క‌నిపిస్తోంది. ఏపీ హోదా విష‌యంలో బాబు వ్యూహం, ప‌వ‌న్ ప్లాన్ బెడిసికొట్టాయి. దీంతో ఇద్ద‌రూ క‌లిసి ఎనిక‌ల‌కు వెళ్లే ఛాన్స్ లేదు. సో.. బాబుకు చిరు లాంటి బ‌ల‌మైన ప్ర‌జాభిమానం ఉన్న నేత అవ‌స‌రం. ఇక అదేస‌మ‌యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్న కాపుల‌ను చ‌ల్లార్చేందుకు కూడా ఆ సామాజిక వ‌ర్గానికే చెందిన బ‌ల‌మైన నేత చిరు రూపంలో చంద్ర‌బాబుకు క‌న‌పిస్తున్నాడు. దీంతో చిరును ఎట్టిప‌రిస్థితిలోనూ టీడీపీలోకి తీసుకునే ఛాన్స్ క‌నిపిస్తోంది.

ఈ విష‌యంపై అటు చిరుగానీ, ఇటు చంద్ర‌బాబు కానీ, ప్ర‌త్య‌క్షంగా ఎలాంటి కామెంట్లు చేయ‌క‌పోయినా.. ఇద్ద‌రూ మాత్రం ఒక‌రిపై ఒక‌రు ఎలాంటి విమ‌ర్శ‌లు చేసుకోకుండా ఉండడాన్ని బ‌ట్టి వీరిద్ద‌రూ ఒకే ఒర‌లో ఇమిడిపోతార‌నే తెలుస్తోంది. కాపుల ఉద్య‌మం నేప‌థ్యంలో ముద్ర‌గ‌డ ఎంత ఒత్తిడి తెచ్చినా.. చంద్ర‌బాబును చిరు విమ‌ర్శించ‌లేదు. పైగా.. కాపుల‌కు బాబు బాగానే ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు క‌దా అని త‌న అనుచ‌రుల వ‌ద్ద ఆయ‌న అన్న‌ట్టు ఓ వార్త లీకైంది. ఇక‌, బాబు కూడా ఎప్పుడూ చిరు విష‌యంలో ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. సో.. వీరిద్ద‌రి మ‌ధ్య పొలిటిక‌ల్ స‌హా ష‌ర‌తుల కెమిస్ట్రీ కుదిరితే.. చిరు.. చంద్ర‌బాబు జ‌ట్టులోకి చేరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది! ఏమో ఏ నిమిషానికి ఏం జ‌రుగునో?! వేచి చూడాల్సిందే!!