అంత డ‌ప్పు ఎందుకు లోకేష్‌బాబు..!

పొలిటిక‌ల్ లీడ‌ర్స్ అన్నాక 24 గంట‌లూ ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేయాలా?  వాళ్ల‌కు మాత్రం కుటుంబాలు ఉండ‌వా?  ఓ వారం ట్రిప్‌క్‌కి వెళ్తే.. కొంప‌లేం మునిగిపోతాయి? ఇటీవ‌ల ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య ఇది! ఆయ‌న ఎవ‌రి గురించి అన్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు!! అదే స‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా దీనిని లైట్‌గానే తీసుకున్నారు. ఎందుకంటే.. ప్ర‌జ‌లు సెంటిమెంట‌ల్ ఫూల్స్ క‌నుక‌!! ఇప్పుడు ఆ సెంటిమెంటును మోతాదుకు మించి మోగించేస్తున్నారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీఎం చంద్ర‌బాబు ఏకైక పుత్ర‌ర‌త్నం లోకేష్ బాబు.

 

సీఎం చంద్ర‌బాబు త‌న జీవితాన్ని, కుటుంబ స‌భ్యులతో గ‌డ‌ప వ‌ల‌సిన గోల్డెన్ అవ‌ర్స్‌ని సైతం ప్ర‌జ‌ల కోస‌మే ధార‌పోస్తున్నార‌ని సెంటిమెంట్‌కు మ‌రికొంత ఆయింట్‌మెంట్ పూసి మ‌రీ డ‌ప్పేస్తున్నారు లోకేష్‌!! త‌న ముద్దుల కుమారుడు, సీఎం ముద్దుల మ‌న‌వ‌డు దేవాన్ష్‌తో చంద్ర‌బాబు ఆడుకునేందుకు క్ష‌ణం కూడా తీరిక ఉండ‌డం లేద‌ని లోకేష్ వాపోయారు. మొన్నామ‌ధ్య చంద్ర‌బాబుకి ముద్దు పెట్ట‌మంటే.. దేవాన్ష్ ప‌క్క‌నే పేప‌ర్‌ను ముద్దాడాడ‌ని, ఇంత‌క‌న్నా ఘోరం ఏముందని, త‌న తండ్రి కుటుంబాన్ని, మ‌న‌వ‌డిని కూడా వ‌దిలి పెట్టి ప్ర‌జ‌ల కోసం, ఏపీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నార‌ని లోకేష్ చెప్పుకొచ్చారు.

 

అయితే, ఈ వ్యాఖ్య‌ల‌పై అధికారులు, కిందిస్థాయి సిబ్బంది మాత్రం తీవ్ర స్థాయిలో ర‌గిలిపోతున్నార‌ట‌. సీఎంగా ఆయ‌న ఒక్క‌రే కుటుంబానికి దూరం అయిన‌ట్టు పెద్ద ఎత్తున డ‌ప్పు కొట్టుకుంటున్నార‌ని, ఆయ‌న‌తోపాటున్న తాము కూడా గంట‌ల కొద్దీ అర్ధ‌రాత్రి వ‌ర‌కు సీఎం ఆఫీస్‌లో విధులు నిర్వ‌హిస్తున్నామ‌ని, దీనివ‌ల్ల తాము కూడా కుటుంబాల‌కు దూరంగానే ఉంటున్నామ‌ని దీనికి ఇంత‌లా డ‌ప్పు కొట్టు కోవ‌డం ఎందుక‌ని వారు అంటున్నారు. వాస్త‌వానికి గ‌త రాజ‌కీయ నేత‌ల‌ను తీసుకుంటే.. వాళ్లు బాబు క‌న్నా ఎక్కువ‌గానే త్యాగాలు చేశారు. పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య పెద్ద ఎగ్జాంపుల్‌. ఆయ‌న త‌న జీవితంలో పిల్ల‌ల‌నే వ‌ద్ద‌నుకుని ప్ర‌జా సేవ‌కి ప‌రిమిత‌మ‌య్యారు. ఈయ‌న కూడా ఏపీ నేతే!!

 

నిజానికి ఒక‌మాట చెప్పాలంటే.. ఏపీ విభ‌జ‌న త‌ర్వాత‌.. రాజ‌ధానిని విజ‌య‌వాడ‌కు మార్చ‌డంతో చంద్ర‌బాబు ఇప్పుడు అక్క‌డ ఉండాల్సి వ‌స్తోంది. లేక‌పోతే.. హైద‌రాబాద్‌లోనే ఉండేవారు క‌దా? అప్పుడు ఎంచ‌క్కా సాయంత్రం కాగానే కుటుంబంతో గ‌డిపేవారుక‌దా అని అంటున్నారు కొంద‌రు అధికారులు. ఇది కూడా నిజ‌మే!! లేదా .. బాబు ఎలాగూ విజ‌య‌వాడ‌లో ఉంటున్నారు కాబ‌ట్టి.. ఫ్యామిలీని విజ‌య‌వాడ‌కో.. గుంటూరుకో మార్చేస్తే.. ఈ ఇబ్బంది ఉండ‌దు క‌దా అని స‌ల‌హా ఇస్తున్నారు. మ‌రి ఏదో ఒక‌టి చేసేస్తే.. ఈ సెంటిమెంట్ గోల ఉండ‌దు క‌దా చిన‌బాబూ..!! ప్ర‌తి విష‌యాన్నీ పార్టీకి, ప్ర‌భుత్వానికి ప్ల‌స్సుల కోసం వాడేసుకుంటామంటే ఎలా? ఒక్కొక్క‌సారి.. ఆ సెంటిమెంట్ ఫెయిల‌పోతే.. ప‌రిస్థితి తేడా వ‌చ్చేస్త‌ది సుమా!!