సీఎంను బ్రోక‌ర్‌తో పోల్చిన హీరోయిన్‌

మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ‌న‌వీస్ ఓ బ్రోకర్‌గా మారార‌ని బాలీవుడ్ ఒక‌ప్ప‌టి న‌టి ష‌బానా అజ్మీ ఓ రేంజ్‌లో ఫైర‌య్యారు. అంతేకాదు, దేశ భ‌క్తికి సీఎం వెల‌క‌ట్టి అమ్ముకున్నార‌ని కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు సంధించారు. ఇలాంటి సీఎం ఉండ‌డం దౌర్భాగ్య‌మ‌ని కూడా నిప్పులు చెరిగారు. అంతేకాదు, తాను రాజ్యాంగ ప‌రిధిలోనే సీఎం ను విమ‌ర్శించాన‌ని కూడా అజ్మీ స‌మ‌ర్ధించుకున్నారు. ఇంత‌కీ.. అజ్మీకి అంత కోపం తెప్పించిన ఘ‌ట‌న ఏమై ఉంటుంది? అనేగా సందేహం. చ‌ద‌వండి.. తెలుస్తుంది..

క‌ర‌ణ్ జోహార్, పాక్ హీర్ ఫ‌వాద్ ఖాన్‌ల కాంబినేషన్‌లో రిలీజ్‌కి ఏ దిల్ హై ముష్కిల్ మూవీ రెడీ అయిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ మూవీలో పాక్ హీరో ఉన్నాడు కాబ‌ట్టి ఎట్టిప‌రిస్థితిలోనూ భార‌త్‌లో ఈ మూవీని రిలీజ్ చేయ‌డానికి వీల్లేద‌ని మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన స‌హా బీజేపీ నేత‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగారు. మూవీ నిర్మాత‌, డైరెక్ట‌ర్ క‌ర‌ణ్‌కి వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. దీంతో ఈ సినిమా చుట్టూ పెద్ద వివాదం చుట్టుకుంది. అస‌లు విడుద‌ల అవుతుందా? అవ‌దా?  అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇంత‌లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను క‌లిసిన క‌ర‌ణ్‌.. మూవీ విడుద‌ల‌కు హామీ ఇప్పించుకున్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. మ‌హారాష్ట్రలో మాత్రం క‌ర‌ణ్‌కి పెద్ద షాక్ త‌గిలింది. ఈ మూవీ విడుద‌ల అవ్వాలంటే రూ.5 కోట్లు దేశ సైనికుల సంక్షేమ ఖాతాకు క‌ట్టాల‌ని, అప్పుడే మూవీ విడుద‌ల‌కు స‌హ‌క‌రిస్తామ‌ని మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన అధినేత రాజ్‌ఠాక్కే హుకుం జారీ చేశారు. అది కూడా క‌ర‌ణ్ రాష్ట్ర సీఎం ఫ‌డ‌న‌వీస్ స‌మ‌క్షంలో చ‌ర్చించిన స‌మ‌యంలోనే . ఈ ప్ర‌తిపాద‌న‌కు ఒప్పుకుని తీరాల‌ని రాజ్ ప‌ట్టుబ‌ట్టారు. దీంతో సీఎం స‌మ‌క్షంలోనే క‌ర‌ణ్ ఈ ఒప్పందానికి ఒప్పుకున్నారు. అయితే, ఓ సీఎం స‌మ‌క్షంలోనే ఇలా బేర‌సారాలు జ‌రిగితే స‌ర్దుబాటు చేయాల్సిన ఫ‌డ‌న‌వీస్ తానే ద‌గ్గ‌రుండి క‌ర‌ణ్‌తో రూ.5 కోట్లు ఇప్పించార‌ని అజ్మీ మండిప‌డ్డారు. ఇది బ్రోక‌ర్ ప‌నేన‌న్నారు.  ఇది స‌రికాద‌ని ఆమె పేర్కొన్నారు. మ‌రి అజ్మీ వ్యాఖ్య‌ల‌పై ఠాక్రే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.