బాబు కాపు వ్యూహంపై తెలుగు త‌మ్ముళ్ల‌లో అసంతృప్తి

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తానంటూ 2014 ఎన్నిక‌లకు ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇచ్చిన హామీ నేప‌థ్యంలో రాష్ట్రంలో ర‌గిలిన ఉద్య‌మాన్ని చ‌ల్లార్చడంలో బాబూ వ్యూహం బెడిసికొడుతోందా? అధినేత వ్యూహంపైనా, ప్ర‌త్యేకంగా కాపుల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండ‌డంపైనా టీడీపీ త‌మ్ముళ్లు ఫీలైపోతున్నారా?  పోనీ ఇంత చేసినా.. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో కాపులు టీడీపీ ప‌క్షాన ఉంటార‌ని గ్యారెంటీ ఏంట‌ని త‌మ‌లో తాము చ‌ర్చించుకుంటున్నారా?  బాబు వైఖ‌రిపై కొంద‌రు తెర‌వెనుక విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారా? అంటే ప్ర‌స్తుతం ఔన‌నే తెలుస్తోంది.

2014 ఎన్నిక‌ల్లో కాపుల ఓట్లు ప‌డేందుకు బాబు రిజ‌ర్వేష‌న్ హామీ ఎంత‌గానో దోహ‌ద ప‌డింది. సాధార‌ణంగా ఎన్నిక‌ల‌న్నాక అధికారంలోకి వ‌చ్చేందుకు నేతలు అనేక హామీలు ఇస్తుంటారు. వాటిని అమ‌లు చేయ‌లేక‌పోతే.. ఉండే ప‌ర్య‌వ‌సానాల‌ను అంత‌గా ఎవ్వ‌రూ అంచ‌నా వేయ‌రు. బాబు కాపుల హామీ కూడా ఇలానే అయింది. అధికారంలోకి వ‌చ్చిన ఏడాది త‌ర్వాత‌గానీ.. ఆయ‌న‌కు ఈ హామీ అమ‌లులో ఎన్నిక‌ష్టాలున్నాయో అర్ధం కాలేదు! పోనీ త‌ప్పించుకుందామా? అంటే.. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం రూపంలో పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త‌, ఆందోళ‌న‌లు చంద్ర‌బాబును ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఓ ర‌కంగా తానిచ్చిన హామీ చంద్ర‌బాబుకు పెద్ద బూమ‌రాంగ్ టైప్‌లో ఆయ‌న‌ను వెంటాడుతోంది.

చంద్ర‌బాబు త‌మ జాతికి ఇచ్చిన హామీని నెర‌వేర్చాల్సిందేన‌ని, ఏడాది గ‌డిచిపోయినా త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆక్షేపిస్తూ.. తూర్పుగోదావ‌రి జిల్లాలో కాపు స‌భ ను నిర్వ‌హించారు మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. ఈ సంద‌ర్భంగా కోపోద్రిక్తులైన యువత స‌మీపంలోని ఓ రైలుకు నిప్పంటిచ‌డం, పోలీస్ స్టేష‌న్ల‌పై దాడి చేసి వాహ‌నాలు త‌గ‌ల‌బెట్ట‌డం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ స‌మ‌యంలో వెంట‌నే జోక్యం చేసుకున్న చంద్ర‌బాబు  పొలిటిక‌ల్‌గా దీనిని వైపాకా అధినేత జ‌గ‌న్‌పై నెట్టేశారు. అంటే, కాపుల జోలికిమాత్రం ఆయ‌న వెళ్ల‌లేదు. ఆ త‌ర్వాత జ‌స్టిస్ మంజునాథ క‌మిటీ ని వేశారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్‌పై క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి కాపుల స్థితిగ‌తుల‌పై ఓ నివేదిక‌ను ఆయ‌న కోరారు. ఈ క్ర‌మంలో ముంజునాథ క‌మిటీ త‌న ప‌నిని ప్రారంభించింది.

మ‌రోప‌క్క‌, ముద్ర‌గ‌డ త‌న ఆందోళ‌న‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే త‌న ఇంట్లో నిరాహార దీక్ష‌కు దిగ‌డం, అరెస్టు చేస్తే.. పురుగుల మందు తాగి తాను, త‌న భార్య‌ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌తామ‌ని చెప్ప‌డం మ‌రింత ఆందోళ‌న‌కు దారితీసింది. ఈ క్ర‌మంలో ఆయ‌న దాదాపు వారానికి పైగా ఆస్ప‌త్రిలోనే నిరాహార దీక్ష చేశారు. ఆ త‌ర్వాత కూడా ఆయ‌న కాపు ప్ర‌ముఖులైన దాస‌రి నారాయ‌ణ‌రావు, చిరంజీవి వంటి వారిని ఏక‌తాటిపైకి తెచ్చి కాపు ఉద్య‌మానికి స‌న్న‌ద్ధం చేసే ప‌నిని ప్రారంభించారు. ఇక‌, కాపు ఉద్య‌మం ఈ స్థాయిలో ర‌గులుతుంద‌ని తొలుత ఊహించ‌ని చంద్ర‌బాబు ముద్ర‌గ‌డ వైఖ‌రితో తీవ్ర ఆందోళ‌న‌లో కూరుకుపోయార‌నేది విశ్లేష‌కుల మాట‌.

వాస్త‌వానికి కాపు రిజ‌ర్వేష‌న్ విష‌యంలో చంద్ర‌బాబు వ్యూహం వేరే ఉంది. మ‌ళ్లీ వ‌చ్చే 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు దీనిని నాన‌బెట్టి. . ఓ క‌మిటీ వేసి.. ఆ ఎన్నిక‌ల్లో కూడా విజ‌యం సాధించాల‌నేది ఆయ‌న ఎత్తుగ‌డ‌! అయితే, ముద్ర‌గ‌డ దీనికి గండి కొట్టారు. తాను మ‌ళ్లీ 2019లోనూ అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న చంద్ర‌బాబు.. కాపులు దూర‌మైపోతే క‌ష్ట‌మ‌ని భావించి.. ముద్ర‌గ‌డ ఆందోళ‌న నేప‌థ్యంలోను కాపుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. వారి విద్యారుణాల కోసం రూ. కోట్లు ధార‌పోశారు. అదేస‌మ‌యంలో కాపు విద్యార్థుల విదేశాల‌కు వెళ్తే వారికి కూడా రుణాలు అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. మొత్తానికి కాపులకు తాను వ్య‌తిరేకం కాద‌ని చంద్ర‌బాబు నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అయితే, ఈ ప‌రిణామాలు టీడీపీలో అంత‌ర్గ‌తంగా తీవ్ర విభేదాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని తెలుస్తోంది. చంద్ర‌బాబు కేవ‌లం ఒక వ‌ర్గాన్నే ఆద‌రిస్తున్నార‌ని, వారికే అన్నీ చేస్తున్నార‌ని త‌మ్ముళ్లు తెగ ఫీలైపోతున్నారు. పోనీ ఇంత చేసినా.. కాపు సామాజిక వ‌ర్గం వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌క్షానే ఉంటుంద‌ని ఏమైనా గ్యారెంటీ ఉందా? అనే కోణంలోనూ త‌మ్ముళ్లు ప్ర‌శ్నిస్తున్న‌ట్టు తెలిసింది. కాపుల‌ను లైన్‌లో పెట్టుకోవడం వ‌ర‌కు మంచిదేకానీ, మ‌రీ ఇంత‌గా వారికోసం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇంత చేస్తున్నా.. మ‌రోప‌క్క ముద్ర‌గ‌డ యాంటీ ప్ర‌చారం చేస్తున్నార‌ని, వైకాపా నేత‌లు కూడా అండ‌ర్‌గా ప‌నిచేస్తున్నార‌ని త‌మ్ముళ్లు వాపోతున్నారు.

సో.. ఇదంతా చూస్తుంటే.. చంద్ర‌బాబు కాపు వ్యూహం బెడిసికొట్టింద‌నే అంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం మంజునాథ క‌మిటీ విస్తృతంగా ప‌ర్య‌టిస్తోంది. అయితే, బీసీలు మాత్రం త‌మ‌లో కాపుల‌ను చేర్చ‌డానికి వీల్లేద‌ని చెబుతోంది. ఒక వేళ కాపుల‌ను వీరిలో చేర్చితే.. టీడీపీకి బీసీలు దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఉంది. ఏదేమైనా చంద్ర‌బాబు వ్యూహం ప్ర‌మాదంలో కొట్టుమిట్టాడుతోంది! మ‌రి దీనిపై ఆయ‌న ఫ్యూచ‌ర్‌లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.