తెలంగాణ‌లో ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే రిజ‌ల్ట్ ఇదే

దాదాపు 60 ఏళ్ల‌నాటి తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష నెర‌వేరింది. రెండున్న‌రేళ్ల కింద‌ట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత తాజాగా సీఎం క‌సీఆర్ నేతృత్వంలో 10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాల మ‌హా తెలంగాణ‌గా ఆవిర్భించింది. ప్ర‌జ‌ల‌కు అన్ని స్థాయిల్లోనూ పాల‌న చేరువ‌వ్వాల‌నే ప్ర‌ధాన ఆకాంక్ష‌తో జ‌రిగిన ఈ జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు సృష్టించింది. ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం సిద్దిపేట జిల్లా ప్రారంభంతో ఈ క్ర‌తువును మొద‌లు పెట్టిన సీఎం కేసీఆర్‌.. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామ‌ని అన్నారు. అదే స‌మ‌యంలో ఈ జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అనంత‌రం అధికార టీఆర్ ఎస్‌కి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నార‌ని ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టికిప్పుడు తెలంగాణ లో ఎన్నిక‌లు జ‌రిగితే.. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ కారు ర‌య్య‌ర‌య్య‌న దూసుకు పోతుంద‌ని, ప్ర‌తి ప‌క్షాల అడ్ర‌స్‌కూడా గ‌ల్లంత‌వుద‌ని చెప్పారు. ఒక్క త‌మ మిత్ర‌ప‌క్షం మ‌జ్లిస్ త‌ప్ప మిగిలిన పార్టీల‌న్నీ డిపాజిట్లు కూడా రాబ‌ట్టుకోలేని ప‌రిస్థితికి వెళ్లిపోతాయ‌న్నారు. ‘‘ఇప్పుడే వచ్చిన సర్వే ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అన్ని ప్రతిపక్ష పార్టీలకు కలిపి ఏడెనిమిది శాసనసభ స్థానాలు మాత్రమే వస్తాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీలోనూ మిత్రపక్షం మజ్లిస్‌కు గట్టి పోటీ ఇస్తాం. స్వల్ప ఆధిక్యతతో ఎంఐఎం తన ఏడు స్థానాలను నిలబెట్టుకుంటుంది. అక్కడ కూడా మజ్లిస్, టీఆర్‌ఎస్‌ల మధ్య 48:38 నిష్పత్తిలో ఓట్లు పోలవుతాయి..’’ అని కేసీఆర్ అన్నారు.

మొత్తంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికిప్పుడు ఎల‌క్ష‌న్స్ జ‌రిగితే.. కేసీఆర్ అంచ‌నాల ప్ర‌కారం టీఆర్ ఎస్ గుండుగుత్తుగా 110 స్థానాల‌కు పైగా బుట్ట‌లో వేసుకోవ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌. దీంతో అతిర‌థ మ‌హార‌థులుగా పేరొందిన అటు కాంగ్రెస్‌, ఇటు టీడీపీలోని నేత‌లు ఇక త‌ట్ట‌బుట్ట స‌ర్దు కోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌న్న‌మాట‌! నిజ‌మే కావొచ్చు. ఇప్పుడు మాత్రం తెలంగాణ‌లో కేసీఆర్ రేంజ్ భారీస్థాయిలో పెరిగిపోయింద‌నేది వాస్త‌మే అని అంటున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు కూడా!