టీడీపీ అధ్య‌క్షుడికి చంద్ర‌బాబు హ్యాండ్‌

తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత కిమిడి క‌ళావెంక‌ట్రావుకు ఎదుర‌వుతున్న వింత‌ ప‌రిస్థితి… బ‌హుశా మ‌రెవ్వ‌రికీ అనుభ‌వంలోకి వ‌చ్చి ఉండ‌దు. పార్టీకి ఆయన అత్యంత విధేయుడు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఏవిధ‌మైన అనుమానాలూ లేవు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా మెలిగే వ్య‌క్తుల్లో ఆయ‌నా ఒక‌రు. ప్ర‌స్తుతం  క‌ళావెంక‌ట్రావు.. పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షుడు కూడా. ఇన్ని అర్హ‌త‌లున్నా ఆయనకు మంత్రి పదవి అనేది చాలాకాలంగా అందని ద్రాక్ష లాగానే ఉంటూ ఊరిస్తోంది.

చంద్ర‌బాబు తాజాగా చేప‌ట్ట‌నున్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో క‌ళావెంక‌ట్రావుకు బెర్త్ ఖాయ‌మ‌న్న వ్యాఖ్య‌లు గ‌ట్టిగానే వినిపించాయి. అయితే ఆ అవ‌కాశానికి గండిప‌డ్డ‌ట్టేన‌ని..  తాజాగా నారా లోకేష్ మాటల ద్వారా టీడీపీ ఇన్న‌ర్ పాలిటిక్స్‌లో గుస‌గుస‌లు జోరుగా వినిపిస్తున్నాయి. అమరావతిలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలకు తొలి రెండు రోజులు డుమ్మా కొట్టి.. కార‌ణాలు వెతక‌డంలో.. మీడియాకు ప‌ని క‌ల్పించిన లోకేష్‌ .. మూడోరోజు మాత్రం హాజ‌రై త‌ను అలిగానంటూ వ‌స్తున్న ఊహాగానాల‌కు తెర‌దించిన విష‌యం తెలిసిందే.

ఇక ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో లోకేష్ మాట్లాడ‌తూ మంత్రివ‌ర్గ విస్తరణ అనేది పార్టీ అధినేత ఇష్ట‌మ‌ని, ఆయ‌న ఎప్పుడు తలచుకుంటే అప్పుడు చేస్తారని అంటూ.. ప‌నిలోప‌నిగా… తెలుగుదేశంలో ఒక వ్యక్తికి ఒకే పదవి సిద్ధాంతం అమలవుతుందని  కూడా తేల్చేశారు.  పార్టీ నాయకుల్లో లోకేష్ వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు పెద్ద చర్చే జ‌రుగుతోంది. అంటే పార్టీ ప‌ద‌వుల్లో కీల‌కంగా ఉన్న‌వారికి మంత్రి ప‌ద‌వి రావ‌డం క‌ష్ట‌మేన‌న్న‌మాట‌.  ఈ కోణంలో చూస్తే క‌ళావెంక‌ట్రావు వంటి నేత‌లు మంత్రిప‌ద‌వుల‌పై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే మ‌రి.

కిమిడి కళా వెంకట్రావు కుటుంబానికి చెందిన ఆయన మరదలు కిమిడి మృణాళిని ప్రస్తుతం  రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు  కళా వెంక‌ట్రావును మంత్రిగా తీసుకోవడం అంటే…. మృణాళినికి  ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. అయితే మ‌హిళ‌ల కోటాలో స్థానం ఇచ్చిన ఆమెను త‌ప్పించ‌డం  అంటే మ‌రో మ‌హిళ‌కు స్థానం క‌ల్పించాల్సి ఉంటుంది.  ఇన్ని చికాకులు పడే బదులు.. ప్ర‌స్తుతానికి.. కళాను దూరం పెట్టి.. బుజ్జగిస్తే సరిపోతుందని ముఖ్య‌మంత్రి చంద్రబాబు భావిస్తూ ఉండ‌వ‌చ్చ‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. సో.. కళా వెంకట్రావుకు ఈ సారికూడా పార్టీ హ్యాండిచ్చినట్టేన‌నే అభిప్రాయం  ప్ర‌స్తుతం పార్టీ నాయకుల్లో వ్య‌క్త‌మవుతోంది.