ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో సీఎం గారి సినిమా

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు రెండు ప‌డ‌వ‌ల మీద కాళ్లు వేసి ప్ర‌యాణం చేస్తున్నారు. స‌ర్దార్ సినిమా త‌ర్వాత కాట‌మ‌రాయుడు సినిమా స్టార్ట్ చేసిన ప‌వ‌న్ మ‌ధ్య‌లో ప్ర‌త్యేక హోదా కోసం తిరుప‌తి, కాకినాడ‌లో రెండు స‌భ‌ల‌తో పొలిటిక‌ల్‌గా హంగామా చేశారు. మ‌ళ్లీ కాస్త సైలెంట్ అయ్యారు. మ‌ళ్లీ ఇప్పుడు కాట‌మ‌రాయుడు షూటింగ్‌లో బిజీ బిజీ అయ్యాడు. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని చెపుతున్న ప‌వ‌న్ అటు సినిమాల‌తో పాటు ఇటు రాజ‌కీయాల్లో కూడా ఉంటాన‌ని చెపుతున్నాడు.

అయితే ప‌వ‌న్ అటు సినిమాలు కంటిన్యూగా చేయ‌డం లేదు..ఇటు రాజ‌కీయంగాను కంటిన్యూగా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. దీంతో ఆయ‌న‌తో సినిమాలు చేయాల‌ని క్యూలో ఉన్న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు పెద్ద చిక్కులే వ‌చ్చిప‌డుతున్నాయి. ప‌వ‌న్ ఎప్పుడు షూటింగ్ అంటాడో ? ఎప్పుడు పాలిటిక్స్ అంటాడో ? కూడా ఎవ్వ‌రికి క్లారిటీ ఉండ‌డం లేదు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు షూటింగ్‌లో ఉన్న ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో రాధాకృష్ణ నిర్మించే సినిమాలో న‌టిస్తాడ‌ని టాక్‌.

త్రివిక్ర‌మ్ త‌ర్వాత బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో దాస‌రి నిర్మించే సినిమా లైన్లో ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ఏకంగా ఓ మాజీ సీఎం వ‌చ్చి చేరిపోయారు. క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా ఓ సినిమా తీయాల‌ని ప్లాన్లు వేస్తున్నారు. గ‌తంలో క‌ర్ణాట‌క సీఎంగా ప‌నిచేసిన ఆయ‌న అక్క‌డ టాప్ డిస్ట్రిబ్యూట‌ర్‌. చెన్నాంబిక ఫిలిమ్మ్ బ్యాన‌ర్‌పై సినిమాలు నిర్మిస్తున్న కుమార‌స్వామి ప్ర‌స్తుతం త‌న కుమారుడు నిఖిల్ గౌడ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ రూ.75 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో జాగ్వార్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.

ఇటీవ‌ల జ‌రిగిన ఈ మూవీ ఆడియో ఫంక్ష‌న్‌కు ప‌వ‌న్‌ను ఆయ‌న ఆహ్వానించినా ప‌వ‌న్ బిజీ వ‌ల్ల హాజ‌రు కాలేదు. ఇక వీరిద్ద‌రి భేటీలో ప‌వ‌న్‌తో కుమార‌స్వామి నిర్మించే సినిమా విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. తాజాగా కుమార‌స్వామి మాట్లాడుతూ తాను ఇక‌పై తెలుగులో కూడా వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తాన‌ని… ముందుగా జగపతి బాబు హీరోగా ఓ సినిమాను నిర్మిస్తానని.. పవన్ కళ్యాణ్‌తో కూడా ఓ సినిమా ఉంటుందని వెల్లడించాడు. సో ఇప్పుడు ఈ మాజీ సీఎం నిర్మాత‌గా ప‌వ‌న్ హీరోగా ఓ సినిమా రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.