కాంగ్రెస్ చేసిన త‌ప్పునే చేస్తోన్న చంద్ర‌బాబు

త‌న‌కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రూట్‌లోనే సీఎం చంద్ర‌బాబు ప‌య‌నిస్తున్నారా? అంటే సీఎంగా చంద్ర‌బాబు తాజాగా తీసుకున్న డెసిష‌న్స్ చూస్తున్న విశ్లేష‌కులు ఔన‌నే అంటున్నారు. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ స‌మ‌యంలో తమకు న‌చ్చిన ప్రైవేటు సంస్థ‌ల‌కు అడ్డ‌దిడ్డంగా భూములు అప్ప‌గించేశారు. అవే ఆ త‌ర్వాత కాలంలో పెద్ద వివాదాస్ప‌ద మ‌య్యాయి.

ఇప్పుడు చంద్ర‌బాబు కూడా ఇదే రూట్‌లో వెళ్తున్నార‌ని విశ్లేష‌కులు విమ‌ర్శిస్తున్నారు. అయిన దానికీ, కాని దానికీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వ భూముల‌ను క‌ట్ట‌బెడుతున్నార‌ని అంటున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో శ్రీమత్‌ ఉభయ వేదాంతచార్య పీఠానికి శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తర్లిపేటలో 209.84 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకే కట్టబెట్టాలని నిశ్చయించుకొన్నారు. దానిలో ఎకరం రూ.1.50 లక్షల చొప్పున 50 ఎకరాలని, మిగిలిన 159.84 ఎకరాలని ఎకరం కేవలం రూ.50,000 నామ మాత్రపు ధరకి కట్టబెట్టాలని నిర్ణయించారు. అక్కడ ఆ సంస్థ రూ.350 కోట్లు వ్యయంతో వేదిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తుంది. దీనిపైనే విమ‌ర్శ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ వ‌ర్సిటీ ఏర్పాటు వ‌ల్ల కేవలం కొద్ది మందికే ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని.. అలాంట‌ప్పుడు వంద‌ల కొద్దీ ఎక‌రాల‌ను ఆ సంస్థ‌కు క‌ట్ట‌బెట్ట‌డం ఎందుక‌ని అంటున్నారు. గ‌జం స్థ‌లం లేక అల్లాడుతున్న పేద‌లు ఎంద‌రో ఉన్నార‌ని వాళ్ల గురించి ఆలోచించ‌కుండా ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. పోనీ అదే స్థ‌లాల‌ను భారీ స్థాయి ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించేందుకు ఇస్తే.. ఎవ‌రూ ఎలాంటి అభ్యంత‌ర‌మూ వ్య‌క్తం చేయ‌ర‌ని, వీటివ‌ల్ల ఉపాధి క‌ల్ప‌న ఉంటుంద‌ని అంటున్నారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే చేసి వివాదాస్ప‌ద‌మ‌య్యార‌ని అంటున్నారు. మ‌రి ఇలాంటి సూచ‌న‌ల‌ను స‌ల‌హాల‌ను సీఎం ఎంత వ‌ర‌కు స్వీక‌రిస్తారో చూడాలి.