ఈ నాయ‌కులా నీతులు చెప్పేది?

పొద్దున్న లేచింది మొద‌లు.. ప్ర‌తిప‌క్షం చేసిన వ్యాఖ్య‌ల‌పై అధికార ప‌క్షం, అధికార ప‌క్షం చేసిన విమ‌ర్శ‌ల‌పై ప్ర‌తిప‌క్షం.. ఇలా విమ‌ర్శ‌లూ ప్ర‌తివిమ‌ర్శ‌లే క‌నిపిస్తాయి!! మైకుల్లో అరుస్తూ.. ఎదుటి వారిపై ఆగ్రహాన్ని ప్ర‌దర్శిస్తూ.. వినేవాళ్ల చెవుల్లో దుమ్ము దులిపేస్తూ అన‌ర్గ‌ళంగా, ఏకధాటిగా.. ఊక‌దంపుడు ఉప‌న్యాసాల్ని కొన‌సాగిస్తారు! ప్ర‌స్తుతం అధికార‌, ప్ర‌తిప‌క్షాల్లో ఎక్కువ‌మంది రోజూ క‌నిపించే ముఖాలు కొన్ని ఉన్నాయి. మ‌రి వీళ్లు ఎంత‌వ‌ర‌కూ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు? వీరి శ్రీ‌రంగ‌నీతులను చూసి జ‌నాలు ఏమ‌నుకుంటున్నారు? అనేవి ఎప్పుడైనా ఆలోచించారా? స‌మాధానం దొర‌క‌ని ప్ర‌శ్నే!!

అటు జ‌నసేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై, ఇటు సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించేందుకు ముందుకొచ్చే వ్య‌క్తి న‌గ‌రి ఎమ్మెల్యే రోజా! సినిమాల్లో నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆమె..మైకు ముందు గొంతు చించుకు అరిచినా అవి కేవ‌లం ఓవ‌ర్ యాక్ష‌న్‌లానే అనిపిస్తుంది. ప‌విత్ర‌మైన శాస‌న‌స‌భ‌లో `చంద్ర‌బాబు కాదు కామ‌బాబు` అంటూ.. సీఎంనే విమర్శించింది. అలాగే మ‌రో మ‌హిళా ఎమ్మెల్యే అనిత‌ను అగౌర‌వంగా మాట్లాడారు. అయితే ఒక ఎమ్మెల్యేగా ఉంటూ.. అడ‌ల్ట్ కామెడీ షోలో వ్యాఖ్యాత‌గా ఉండ‌టంపైనా.. విమర్శ‌లు గుప్పుమంటున్నాయి.

ఇక వైసీపీ త‌ర‌ఫునే క‌నిపించే మ‌రో నాయ‌కుడు అంబ‌టి రాంబాబు! అధినేత జ‌గ‌న్‌పై ఈగ వాలేందుకు ప్ర‌య‌త్నించినా దానిని ద‌రిచేర‌నివ్వ‌ని ర‌కం! మైకులు ప‌గిలిపోయేలా.. చెవుల్లోంచి ర‌క్తాలు కారిపోయేలా.. ఆయ‌న చేసే ప్ర‌సంగాలు ప్ర‌జ‌ల్లో ఏహ్య‌భావాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వంటి వారి గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే మంచిది. దొంగే దొంగ అన్న చందంగా.. వీరు ఇత‌రుల‌పై ఎదురుదాడికి దిగుతుంటారు.

ఇక తెలుగుదేశం పార్టీ నేత‌లు కూడా త‌క్కువేం కాదు!! బాబూ రాజేంద్ర ప్ర‌సాద్‌, బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు వంటి వారు ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై చేసే విమ‌ర్శ‌లు.. చీప్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే రోజా, బోండా మ‌ధ్య వార్ శాస‌న‌స‌భ స‌మావేశాల నాటిది. వారు వ్యంగ్యంగా చేసే విమ‌ర్శ‌లు ఎదుటి వారి గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా, రాజ‌కీయాలంటే ఇంతేనా అనేంత స్థాయిలో ఉంటున్నాయి. ఇక చంద్ర‌బాబు, జ‌గ‌న్ త‌మ పార్టీల త‌ర‌పున ఇలా చీప్ వాయిస్ వినిపించే వారి కంటే స‌మ‌ర్థులైన వారిని నియ‌మిస్తే వారితో పాటు పార్టీల‌కు కూడా గౌర‌వం పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.