రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన కెసిఆర్!

మహా ఒప్పందంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టే చెత్త ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితలు కమీషన్ల కోసం డిజైన్లు మార్చారని ఆరోపించారు. వీరంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలనిడిమాండ్ చేశారు. జీఓ 123 ప్రకారం భూసేకరణ చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిగ్గులేకుండా అప్పీలుకు వెళ్తోందన్నారు.
అంతకుముందు నీటి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఒప్పందాన్ని నిరసిస్తూ టీ. కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌ నుంచి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
రీడిజైనింగ్ పేరుతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వ్యయాన్ని రూ. 50 వేల కోట్లు పెంచారని ఉత్తమ్ విమర్శించారు. టీఆర్ఎస్ చేప్తున్న ఆయకట్టుకు… నీటి లభ్యతకు పొంతనే లేదని పొన్నాల స్పష్టం చేశారు. మహారాష్ట్రతో ఒప్పందంపై బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు పొన్నాల సవాల్ విసిరారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కుడా కేసీఆర్ పై విరుచుకుపడింది. మహా ఒప్పందం ఎలా చరిత్రాత్మకమైనదో చెప్పాలని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్ర డిమాండ్లకు తలొగ్గడం చరిత్రాత్మకమా అని నిలదీశారు. తెలంగాణ సర్వహక్కులను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇది చరిత్రాత్మకం కాదు.. చీకటి ఒప్పందం అని ఆయన ఎద్దేవా చేశారు.