నయనతార స్కెచ్‌ అదుర్స్‌

మామూలుగా ఒక సినిమా హిట్టవ్వాలంటే ఆ సినిమాకు ఎంతో కొంత పబ్లిసిటీ అవసరం. అలా అని ఓవర్‌ పబ్లిసిటీ చేసిన సినిమాలు పరాజయాలయిన సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ ఎంతో కొంత పబ్లిసిటీ అయితే అవసరం. అందులో భాగంగానే ఆడియో రిలీజ్‌ పేరిట, చిత్ర యూనిట్‌ అంతా ఆ ఫంక్షన్‌లో పాల్గొనడం ఆనవాయితీ. అయితే ముద్దుగుమ్మ నయనతార నటించిన సినిమాల్లో ఏ సినిమాకీ ఆమె హాజరు కాదు.

చాలా కాలంగా ఆమె మీద ఈ విషయంలో పెద్ద అపవాదే ఉంది. తాజాగా ఆమె నటించిన ‘బాబు బంగారం’ సినిమా ఆడియో ఫంక్షన్‌కి కూడా ఆమె హాజరు కాలేదు. ఈ విషయంపై పెద్ద చర్చే జరిగింది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్‌ విషయంలో కూడా నయనతార చిత్ర యూనిట్‌ని చాలా ఇబ్బంది పెట్టిందనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఆ విమర్శల నుంచి తప్పించుకునేందుకు భారీ స్కెచ్‌ కూడా వేసిందట నయనతార.

తాను ప్రమోషన్స్‌లో పాల్గొన్న సినిమాలేవీ విజయం సాధించవనే సెంటిమెంట్‌ తనకి ఉందంటూ అందర్నీ నమ్మించడానికి ట్రై చేస్తోంది. అందుకే తనను ఈ విషయంలో ఎవ్వరూ బలవంతం చెయ్యెద్దంటోంది కూడా. ఆమె ఆడియో ఫంక్షన్‌కి అటెండ్‌ కాని సినిమాలు ఖచ్చితంగా విజయం సాధిస్తాయని నమ్మకంగా చెబుతోంది. తెలుగులో చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న ‘బాబు బంగారం’ సినిమా విజయం సాధించాలనే ఆశతోనే ఆ ఫంక్షన్‌కి తాను రాలేదని భలే తప్పించుకుంటోంది. వావ్‌! నయనతారకు అందంతో పాటు కుసింత తెలివితేటలు కూడా ఎక్కువే సుమీ.