ధనుష్ ‘కబాలి’కి రంగం సిద్ధమైందా

ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పబ్లిసిటీ మోత మోగించేసింది ‘కబాలి’ సినిమా. అయితే ఇంత సెన్సేషన్‌ సృస్టించినప్పటికీ ఈ సినిమా విడుదల అయ్యాక ఆశించి అంచనాలను అందుకోలేకపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘కబాలి’ సినిమాకి సీక్వెల్‌ రానుందని వార్తలు వస్తున్నాయి. రావడమే కాదు ఏకంగా డిసెంబర్‌లో ‘కబాలి 2’ సెట్స్‌ మీదకు వెళ్ళనుందట కూడా. అంతేకాదు ఈ చిత్రాన్ని రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ నిర్మించే అవకాశం ఉందట.

ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నట్లు ధనుష్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించడంతో అది కబాలియేనని అభిమానులు అనుకుంటున్నారు. ‘కబాలి’ సినిమాను తెరకెక్కించిన పా రంజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. తొలి పార్ట్‌లో చేసిన చిన్న చిన్న పొరపాట్లను ఈ సినిమాలో చేయకుండా అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాని తెరకెక్కించే యోచనలో ఉన్నారట చిత్ర యూనిట్‌.

అయితే రజనీకాంత్‌ ప్రస్తుతం ‘రోబో 2.0’ సినిమా చేయాల్సి వుంది. ఈ సినిమా తర్వాతగానీ తన తదుపరి సినిమాపై ప్రకటన చేయకపోవచ్చునని సమాచారమ్‌. మొత్తానికి రజనీ, ధనుష్‌ ‘కబాలి 2’ సినిమా ప్రచారం అయితే జనాల్లోకి బాగా చేరువయ్యింది. ‘కబాలి’తో అందుకోలేని అంచనాలను ‘కబాలి 2’తో అందుకోవాలనే యోచనలో ఉన్నాడు ఆ సినిమా డైరెక్టర్‌ పా రంజిత్‌. ఆల్‌ ది బెస్ట్‌ టు ధనుష్‌ అండ్‌ పా రంజిత్‌ ఫర్‌ ‘కబాలి 2’.