‘త్వరలో’ అంటే పదేళ్ళు సరిపోద్దా!

త్వరలో ప్రత్యేక హోదాపై స్పష్టత రావచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి. ఈలోగా తొందరపాటు నిర్ణయాలు తగవనీ, ఆందోళనల వల్ల ఉపయోగం లేదని, నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేకంగా చూస్తోందని ఈ కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కానీ ప్రత్యేక హోదా వస్తుందని నమ్మి భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమకు హోదా రాక తీవ్ర నిరాశ చెందుతున్నమాట వాస్తవం.

ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా వస్తుందని కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టతా రావడంలేదు. వస్తుందో రాదో అన్న విషయమ్మీద స్పష్టత ఇవ్వడానికే ఇంత సమయం తీసుకుంటే, ప్రత్యేకహోదా ఇస్తామని ఒకవేళ చెప్పినా, అది ఇచ్చేదెప్పుడోనని మళ్లీ ఎదురుచూడాల్సి వస్తుంది. రెండేళ్ళ రెండు నెలల సమయం అంటే అది ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కి యుగాల కిందే లెక్క. ఎందుకంటే ప్రతి క్షణం ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో విలువైనది. నెలలు, ఏళ్ళు గడిచిపోతున్నా పార్లమెంటు సాక్షిగా దక్కిన హామీని అమలు చేయకపోవడం వల్ల పార్లమెంటు పట్ల ప్రజల్లో నమ్మకం పోతోంది. వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం కోల్పోతే తద్వారా తలెత్తే పరిణామాలు అతి తీవ్రంగా ఉంటాయి.

విభజించి కాంగ్రెసు పార్టీ నష్టపోయింది, ఆ విభజనతో బిజెపి, తెలుగుదేశం పార్టీలు లాభపడ్డాయి. ప్రజలకు మళ్ళీ నష్టమే మిగిలింది. ప్రత్యేక హోదా పేరు చెప్పే వెంకయ్యనాయుడు బిజెపిలో ఉనికిని చాటుకున్నారు. టిడిపి గెలవబట్టే సుజనా చౌదరి కేంద్ర మంత్రి అయ్యారు. కానీ వీరిరువురూ ప్రత్యేక హోదా కోసం పనిచేయకపోవడం శోచనీయమని ప్రజలు అంటున్నారు.