కేవీపీ, కేసీఆర్ దోస్తానా

“కేవీపీ రామ‌చంద్రరావు” తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల గురించి అవ‌గాహ‌న ఉన్నవారికి ప‌రిచ‌యం అక్కర్లేని పేరు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆత్మగా పేరున్న కేవీపీ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేశారు. ఇక టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి రెండు రాష్ట్రాల ప్రజ‌ల‌కే దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ నాయ‌కుల‌కు సైతం తెలుసు. సిద్ధాంత‌ప‌రంగా ఉప్పు-నిప్పులాగా ఉండే ఈ ఇద్దరు నేత‌ల మ‌ధ్య మంచీ దోస్తీ ఉంద‌నే వార్తలు కొద్దికాలంగా వెలువ‌డుతున్నాయి. అయితే ఇది మ‌రింత‌గా బ‌ల‌ప‌డింద‌ని తాజా ప‌రిణామాల ఆధారంగా రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌ రాజ్యసభ సభ్యులైన కేవీపీ రామచంద్రరావు తండ్రి కోటగిరి వెంకట నరసింహ సత్యనారాయణ రావు (బుచ్చినాయన) రచించిన పద్మనాయక చరిత్ర మలి ముద్రణ ప్రతిని తాజాగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలు, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత  ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు.  ఏ జాతి చరిత్ర రాసిన అంతిమంగా అది తెలుగు జాతి చరిత్రను సంపూర్ణ చేస్తుంది. అన్ని జాతుల చారిత్ర రావాలని, అన్ని జాతులు వెలగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమ రూపంలో ఒక సంక్షోభం వచ్చిందని అప్పుడు త‌మ చరిత్రను తామే వెతుక్కోవాల్సి వచ్చిందని క‌విత చెప్పారు.

తెలంగాణ చరిత్రకు దక్కాల్సిన గౌరవం దక్కిఉంటే సంక్షోభం వచ్చేదే కాదని క‌విత‌ అభిప్రాయ‌ప‌డ్డారు.ఈ కార్యక్రమంపై రాజ‌కీయ వ‌ర్గాలు జోరైన విశ్లేష‌ణ చేస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం స‌భ్యురాలైన క‌విత ప్రతిప‌క్ష కాంగ్రెస్ నాయ‌కుడి కార్యక్రమానికి వెళ్లడం ఆస‌క్తిక‌రం. వంద‌ల సంద‌ర్భాల్లో తెలంగాణ‌కు మొద‌టి శ‌త్రువు వైఎస్ అని కేసీఆర్ ఆరోపించిన తీరును గుర్తుచేస్తున్నారు. అయిన‌ప్పటికీ వైఎస్ ఆప్తమిత్రుడి వ్యక్తిగ‌త కార్యక్రమానికి ఎంపీ క‌విత  వెళ్లడం తార్కణమంటున్నారు. కేవీపీ-కేసీఆర్‌ల మ‌ధ్య బ‌ల‌ప‌డుతుంద‌నేందుకు ఈ కార్యక్రమ‌మే నిద‌ర్శన‌మ‌ని వారు పేర్కొంటున్నారు.