కాంగ్రెసోళ్ళూ సినిమా చూపించారు

తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇస్తే, దాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. వాస్తవాల్ని దాచిపెట్టి, కెసియార్‌ ఉత్త సినిమా చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి కాంగ్రెసుతోపాటు ఇతర విపక్షాల నుంచి.

వాస్తవాలతో కూడిన పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ మేం ఇస్తామని కాంగ్రెసు ఎంతో హడావిడి చేసినా, ఆలస్యం చేయడంతో కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే సొంత పార్టీపై అసహనంతో ఊగిపోయారు. వారిలో కొందరు, కాంగ్రెసుని వీడి, టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు కూడా. అయితే తీరికగా కాంగ్రెసు పార్టీ, పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చింది. కాంగ్రెసు హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు తక్కువ మొత్తం చెల్లిస్తే అవి పూర్తయి, సత్ఫలితాలను ఇస్తాయని, కానీ వాటిని రీ-డిజైన్‌ చేయడం ద్వారా కాంగ్రెసుకి క్రెడిట్‌ రాకుండా చేయడమే లక్ష్యంగా కెసియార్‌ పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

ప్రాజెక్టుల రీ-డిజైన్‌ పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంతోపాటు, అధికార పార్టీ నేతలు ప్రజా ధనాన్ని దోచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ స్థాయి కాంగ్రెసు నాయకులు కూడా హాజరయ్యారు. అయితే కాంగ్రెసు ఆరోపణల్లో నిజం లేదని టిఆర్‌ఎస్‌ అంటోంది. సకాలంలో తెలంగాణలోని ప్రాజెక్టుల్ని కాంగ్రెసు పూర్తి చేసి ఉంటే, ఇప్పుడు ప్రాజెక్టుల కోసం తాము యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టవలసి వచ్చేది కాదని టిఆర్‌ఎస్‌ వాదిస్తోంది.