హోంమంత్రి రేసులో రెడ్డిగారికి ఛాన్స్‌! 

ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆయన్ను తప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నారట. తుని విధ్వంసం ఘటనలో ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టం. ఆ తర్వాత కూడా శాంతిభద్రతల నిర్వహణలో నిమ్మకాయల చినరాజప్ప అలసత్వం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారని సమాచారమ్‌. అయితే సామాజిక వర్గ సమీకరణాలు, కాపు ఉద్యమం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఇప్పటివరకూ ఆ విషయాన్ని బయటపెట్టలేదట.

అతి త్వరలోనే చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారని, ఈ సమయంలో నిమ్మకాయల చినరాజప్పను తప్పిస్తారనీ టాక్‌ వినవస్తోంది. అయితే ఆయన స్థానంలో ఎవరికి ఛాన్స్‌ ఇస్తారో అన్న సస్పెన్స్‌ అలానే ఉంది. ఇంకో వైపున తనకు హోంమంత్రి పదవి ఖాయమయ్యిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు ను వీడి టీడీపీ పార్టీలోకి వెళ్ళిన ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు చెప్పుకుంటున్నారట. ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. పవర్‌ఫుల్‌ లీడర్‌గానూ ఆయన రాయలసీమలో పేరు తెచ్చుకున్నారు. గతంలో ఆయనకు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది.

అనేక రకాలైన సమీకరణాల తర్వాత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారట. ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌లలో మంత్రి వర్గ విస్తరణ ఉండనుందట. అప్పుడే లోకేష్‌ని మంత్రి వర్గంలో తీసుకోవడంపైనా చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారని తెలియవస్తోంది.