సూపర్‌ స్టార్‌ అల్లుడు సూపరండీ

తమిళ సినీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ కూడా అక్కడ స్టార్‌ హీరోనే. విలక్షణమైన నటతో విభిన్నమైన కథాంశాలతో రూపొందే చిత్రాలు చేస్తుంటాడు ధనుష్‌. కమర్షియల్‌ సినిమాల జోలికి వెళ్ళడు. కానీ తను చేసే సినిమాలతో కమర్షియల్‌ విజయాలు అందుకుంటుంటాడు. కథల ఎంపికలో మొదటి నుంచీ ధనుష్‌ది విలక్షణమైన తీరు. ఈ యంగ్‌ హీరో బాలీవుడ్‌లో కూడా నటించాడు. తెలుగులో కూడా స్ట్రెయిట్‌గా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు.

నటన మాత్రమే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ధనుష్‌ ముందుంటాడు. అయితే తను పాల్గొనే సేవా కార్యక్రమాల వివరాలు గోప్యంగా ఉంచుతాడు. సహాయం అనేది గోప్యంగా చేస్తేనే దానికి విలువ అని నమ్మే అతి కొద్ది మంది వ్యక్తుల్లో ధనుష్‌ కూడా ఒకడు. ఈ యంగ్‌ హీరో ఓ చిన్నారిని పరామర్శించాడు. ఆ చిన్నారి ప్రాణాంతక బ్లడ్‌ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. ధనుష్‌ని చూడాలనేది తన చివరి కోరిక అంటూ ఆ చిన్నారి ధనుష్‌పై అభిమానాన్ని చాటుకుంది. ఎలా తెలిసిందో ధనుష్‌ ఈ విషయం తెలుసుకుని వెంటనే, ఆ చిన్నారి దగ్గరకు వెళ్ళాడు. ఆ చిన్నారిని పరామర్శించి, వైద్య చికిత్సకు అవసరమైన సాయం అందిస్తానని చెప్పాడు.

తమ అభిమాన హీరోని కలుసుకున్న తెలంగాణకు చెందిన ఓ బాలిక, ఆ తర్వాత ప్రాణాంతక రోగాన్ని కూడా జయించింది. ఆ హీరో ఎవరో కాదు, పవన్‌కళ్యాణ్‌. కోలుకున్నాక ఆ బాలిక, పవన్‌కళ్యాణ్‌ వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలిపింది. అభిమాన నటీనటుల ఆ స్పర్శే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొండంత బలం, ఆత్మస్థయిర్యం.