రేవంత్‌రెడ్డికి కౌంటరిచ్చిన కిషన్‌రెడ్డి

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలమేమిటో తెలుసుకోకుండా భారతీయ జనతా పార్టీపై నోరు పారేసుకున్న రేవంత్‌రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి గట్టి కౌంటర్‌నే ఎదుర్కొన్నారు. బిజెపి తమకు మిత్రపక్షమని కూడా చూడకుండా రేవంత్‌రెడ్డి వెటకారం చేయడాన్ని బిజెపి సీనియర్‌ నాయకుడు కిషన్‌రెడ్డి తీవ్రంగా పరిగణించినట్లున్నారు.

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డిని వివరణ కోరితే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? అని కౌంటర్‌ ఇచ్చారు. కలిసి పనిచేయాల్సిన రెండు రాజకీయ పార్టీల మధ్య ఈ తరహా మాటల తూటాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలనుకుంటున్న బిజెపి, ఆ ఎదుగుదలకు టిడిపి ఆటంకం కలిగిస్తుందనే భావనకు వచ్చింది.

రాజకీయ పార్టీగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి క్యాడర్‌ ఇప్పుడెంతుందో తెలియదు. నాయకులైతే తెలుగుదేశం పార్టీలో లేరు. ఈ టైమ్‌లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మద్దతు టిడిపికి అవసరం. కానీ టిడిపి కూడా బిజెపితో తెగతెంపులనే కోరుకుంటోంది. కేవలం రెండేళ్ళలోనే టిడిపి – బిజెపి మధ్య ఇంతటి బేదాభిప్రాయాలు ఆశ్చర్యకరం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టిడిపి, బిజెపి మధ్య సఖ్యత కొనసాగడంలేదు. అధికారం పంచుకుంటున్నారు గనుక, అక్కడ తప్పదన్నట్లు ఇష్టం లేని స్నేహం కొనసాగిస్తున్నాయి ఆ పార్టీలు.