మెగాస్టార్ కోసం దేవి ఏమిచేయనున్నాడో తెలుసా?

మ్యూజక్‌తో మ్యాజిక్‌ చేయడమే కాకుండా, అప్పుడప్పుడూ చేతిలోని కలానికి కూడా పని చెబుతూ ఉంటాడు మ్యూజిక్‌ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్‌. అలా జాలువారిన పాటలు ఎన్నో సూపర్‌హిట్స్‌ అయ్యాయి. చాలా వరకూ జానపద గీతాలు ప్రత్యేక గీతాల రూపంలో వాటికి మాస్‌ బీట్స్‌ జోడించి వదులుతాడు. ఆ బీట్స్‌కి ముసలాడి నుండీ, పసిల్లాడి దాకా చిందేయ్యాల్సిందే అన్నట్లుగా ఉంటాయి ఆ పాటలు.

చిరంజీవిపై ఉన్న అభిమానంతో గతంలో ‘శంకర్‌ దాదా ఎమ్‌బిబియస్‌’, శంకర్‌దాదా జిందాబాద్‌’ సినిమాలకు రెండు పాటలు రాశాడు దేవిశ్రీ ప్రసాద్‌. ఆ పాటల్లో చిరు స్టెప్పులకు స్టేజ్‌లు అదిరిపోయాయ్‌. చిరంజీవితో పాటు చాలా మంది ఆ పాటలో చిందేశారు. అలాగే తాజా చిత్రం ‘నాన్నకు ప్రేమతో’లో టైటిల్‌సాంగ్‌ని రాసిన ఘనత కూడా దేవిదే. ఆ పాటకు సలాం కొట్టని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు చిరంజీవి 150 చిత్రంలో మరో పాట రాయనున్నాడట దేవి. మాంచి బీట్‌ ఉన్న మాస్‌ మసాలా సాంగ్‌ అట అది. ఆ పాటలో చిరంజీవి అదిరిపోయేలా స్టెప్పులేయనున్నారట. చిరుతో పాటు దేవిశ్రీ ప్రసాద్‌ కూడా ఈ పాటలో కనిపించనున్నాడట. ఈ సినిమాలోని పాటలన్నీ ఒక ఎత్తు, ఈ పాట ఒక్కటీ మరో ఎత్తు అన్నంతగా ఈ పాటను ప్రిపేర్‌ చేస్తున్నాడట దేవి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా.