బాలకృష్ణ రాజకీయ వ్యవసాయం! 

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా రూపొందుతోంది. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకుడు. శరవేగంగా ఈ చిత్ర నిర్మాణం జరుగుతుండగా ఇంకో వైపున బాలకృష్ణ ‘రైతు’ అనే సినిమాతో వార్తల్లోకెక్కాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రానుంది ఈ సినిమా. అయితే ఇది పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిపే సినిమా అని సమాచారమ్‌ వస్తుండడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఈ సినిమా గురించిన చర్చ వేడివేడిగా జరుగుతోంది. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. దాంతో ఏ కొంచెం పొలిటికల్‌ టచ్‌ సినిమాకి అద్దినా, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించగలుగుతుంది. కృష్ణవంశీ కూడా ఎప్పటినుంచో ఓ ప్రముఖ హీరోతో పొలిటికల్‌ టచ్‌ ఉన్న సినిమా చేయాలనుకుంటున్నాడు.

అలా ఎక్కడెక్కడో తిరిగిన ఆ కథ బాలకృష్ణ దగ్గరకు వచ్చి ఆగిందట. పేరుకి రైతే అయినా సినిమాలో కథా నాయకుడు రాజకీయాల్ని గడగడలాడించేస్తాడని తెలియవస్తోంది. తనకు, అలాగే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా కలిసొచ్చేలా బాలకృష్ణ ఆ కథలో మార్పులు చేర్పులు చేయమని దర్శకుడు కృష్ణవంశీకి సూచించాడని సమాచారమ్‌. ఇదిలా ఉండగా చిరంజీవి చేస్తున్న 150వ సినిమా గురించి కూడా పొలిటికల్‌ గాసిప్స్‌ వినవస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి రాజకీయంగా బలపడే ఉద్దేశ్యంతో తన సినిమాల్ని ప్రచారానికి వాడుకునేలా చిరంజీవి కూడా ప్లాన్‌ చేస్తున్నారట. ఈ ఇద్దరు హీరోలు రాజకీయాల్లో ప్రత్యర్థులు. తమ సినిమాలతో కూడా పోటీ పడతారో, ఎవరికి వారు పబ్లిసిటీ చేసుకుంటారో చూడాలిక.