చంద్రబాబు ప్రచార పాట్లు అన్ని ఇన్ని కావు

కేంద్ర  సహాయం రాకపోయినా, సంక్షేమం కోసం వేల కోట్లు వెచ్చిస్తు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ప్రచారం రావడం లేదని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివిధ శాఖల సమాచారం, సమన్వయం కోసం లక్షలు పోసి నియమించుకున్న ఎంఎల్‌ఓ (మినిస్టర్స్ లైజనింగ్ ఆఫీసర్లు), పీఆర్‌ఓ వ్యవస్థ విఫలం కావడంతో పథకాల ప్రచారం జనంలోకి వెళ్లడం లేదన్న ఫిర్యాదులు సీఎంకు అందాయి.చంద్రబాబుకు, ప్రచారానికి అవినాభావ సంబంధం ఉంది. బాబును చూసి జాతీయ నేతలు ఫాలో అవుతున్నారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత బాబు ప్రభుత్వం ప్రచారంలో వెనుకబడిపోవడం మంత్రులనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రాష్ట్రంలో తగిన బడ్జెట్ లేకపోవడం, ఉన్న సమాచారశాఖ అధికారుల్లో చురుకుదనం లేక, పాత ఆలోచనలతోనే పనిచేయడం, మంత్రులకు నియమించిన చాలామంది ఎంఎల్‌ఓ, పీఆర్‌ఓలు అంచనాకు తగినట్లు పనిచేయకపోవడం, పబ్లిసిటీకి బడ్టెట్ కేటాయించకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎల్‌ఓ వ్యవస్థను ప్రారంభించారు. వారికి దాదాపు నెలకు 25 వేల రూపాయల వరకూ జీతాలు ఇస్తున్నారు. వీరుకాకుండా, ముందే కొందరిని పీఆర్‌ఓలుగా నియమించారు. వీరికీ భారీ స్థాయిలోనే జీతాలు చెల్లిస్తున్నారు. వీరిలో ఇద్దరు ముగ్గురు తప్ప, మిగిలినవారెవరూ అంచనాకు తగినట్లు పనిచేయలేకపోతున్నారు.

అసలు ఎంఎల్‌ఓలు ఎవరి అధీనంలో పనిచేస్తున్నారు? ఎవరికి జవాబుదారీ కూడా తెలియడం లేకుండా పోయింది. కనీసం మంత్రుల శాఖలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త విషయాలను కూడా వీరు మీడియాకు కథనాల రూపంలో చేరవేయలేకపోతున్నారన్న అసంతృప్తి ఉంది. చాలామంది పిఆర్‌ఓ, ఎంఎల్‌ఓలు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన వారే ఉన్నారని, వారికి స్క్రోలింగులు, మాస్ లైవ్ ప్యాకేజీలు వంటి క్లుప్తమైన అంశాలపై తప్ప, వాటిని గణాంకాలతో వివరించి మీడియాకు అందించే ఓపిక, రాసిచ్చే అనుభవం లేదని బాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. అది కూడా ప్రచార లోపానికి మరోకారణమంటున్నారు. కొందరు ఎంఎల్‌ఓలను చూసి మంత్రులు కూడా భయపడుతున్నారని, వారంతా  పేషీలో జరిగే రోజువారీ కార్యకలాపాలు, తమను కలిసేందుకు వచ్చిన వారి వివరాలను పార్టీ ఆఫీసుకు చేరవేసే నిఘా అధికారులుగా భావిస్తున్నారన్న వ్యాఖ్యలు ఉన్నాయి.

అదీకాకుండా వారిలో ఎక్కువమంది ఒకే సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో మంత్రులు కూడా మనకెందుకులే అన్నట్లు మిన్నకుండిపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంపైనా బాబు దృష్టి సారిస్తున్నారు. ఇటీవలి కాలంలో సదావర్తి భూముల అమ్మకాలు, స్విస్ చాలెంజ్, బొగ్గు అమ్మకాలపై వివిధ పత్రికలు, చానెళ్లలో వచ్చిన వ్యతిరేక వార్తలకు ధీటుగా జవాబు ఇవ్వలేకపోయారని అధికారులపై బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సమాచారశాఖను పిఐబి తరహాలో నడిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సత్ఫలితాలిస్తున్నాయి. పిఐబిలో సుదీర్ఘకాలం పనిచేసిన వెంకటేశ్వర్ సమాచారశాఖ కమిషనర్‌గా వచ్చిన తర్వాత శాఖల వారీగా విశ్లేషణలపై మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది.