ఐటీ జాబా:జర భద్రం బ్రదర్!

వచ్చే ఐదు సంవత్సరాల వ్యవధిలో భారత ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 6.4 లక్షల మంది తమ ఉద్యోగాలను పోగొట్టుగోనున్నారని యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న రీసెర్చ్ సంస్థ హెచ్ఎఫ్ఎస్ అంచనా వేస్తోంది. ఐటీ నిపుణుల్లో నైపుణ్యత తగ్గుతుండటం, యాంత్రీకరణ పెరగడమే ఇందుకు కారణమని, పనితీరు మెరుగుపరచుకోకుంటే, ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించింది. 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 9 శాతం మంది, అంటే సుమారు 14 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతారని, భారత్ లోనే అధిక ఉద్యోగ కోత కనిపిస్తోందని పేర్కొంది. యూకే, యూఎస్, ఫిలిప్పీన్స్ దేశాల్లో సైతం ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గనుందని పేర్కొంది.

కాగా, నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ సర్వీసెస్ కంపెనీస్) సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని ఇటీవల వెల్లడించింది. యాంత్రీకరణ, రోబోటిక్స్ వాడకం ఐటీ కంపెనీల్లో పెరుగుతోంది. అయితే, ఉద్యోగులను తొలగించే చర్యలు ఏ మేరకు ఉంటాయన్నది ఇప్పటివరకూ స్పష్టం కాలేదు. సాంకేతిక రంగంలో అందివస్తున్న అధునాతన టెక్నాలజీతో కొంత ప్రభావం ఉండి తీరుతుంది. పనిలో నైపుణ్యవంతులైన వారి ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు అని నాస్ కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత్ గుప్తా అంచనా వేశారు. ప్రస్తుతం భారత ఐటీ-బీపీఓ రంగంలో 37 లక్షల మంది పనిచేస్తున్నారని వివరించారు.

ఇక తాజా సర్వేలో భాగంగా, అధిక నైపుణ్యత కలిగిన ఉద్యోగుల సంఖ్య వచ్చే ఐదేళ్లలో 56 శాతం వరకూ పెరుగుతుందని, ఓ తరహా నైపుణ్యం ఉండే వారి సంఖ్య 8 శాతం పెరుగుతుందని, 30 శాతం మంది వరకూ నైపుణ్యం లేని వారి ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్ఎఫ్ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫిల్ ఫెస్ట్ వెల్లడించారు. మొత్తం 1477 మంది ఐటీ సంస్థల ప్రతినిధులను సర్వే చేసి ఈ నివేదిక రూపొందించినట్టు వెల్లడించారు.