ఇద్దరు చంద్రులకీ ఇష్టంలేదేమో!

అత్యంత కీలకమైన సమస్య ఏమీ కాదుగానీ హైకోర్టు విభజన అంశానికి సెంటిమెంట్‌ రంగు అంటుకుంటోంది. ఇది ప్రజల దృష్టికోణంలో చూసినప్పుడు ఏమాత్రం ఈ వివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. అవసరమైతే విభజన చట్టాన్ని సవరించి అయినా హైకోర్టు విభజన కోసం కేంద్రం తగు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఇందులో కీలక భూమిక కేంద్ర ప్రభుత్వానిదే. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసియార్‌, చంద్రబాబు ఒక్కతాటిపైకి వస్తే తప్ప కేంద్రం ఈ విషయంలో ముందడుగు వేయలేదు. వివిధ అంశాల్లో కెసియార్‌, చంద్రబాబు ఒకే మాట మీదకు వచ్చారు. అమరావతి శంకుస్థాపనకు కెసియార్‌ వెళితే, కెసియార్‌ చేపట్టిన యజ్ఞానికి చంద్రబాబు హాజరయ్యారు.

హైకోర్టు విభజనలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులూ మెట్టుదిగక్కర్లేదు, ఒక చోట సమావేశమయితే సరిపోతుంది. ఈ ఇద్దరు చంద్రులు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే, కేంద్రం సాకులు చెప్పడానికి ఏమీ ఉండదు. ఏ సమస్య వచ్చినా, విభజన చట్టం ప్రకారమే నడుచుకుంటున్నామంటూ తప్పించుకు తిరిగే ధోరణి కేంద్రం ప్రదర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కి హోదా, ప్యాకేజీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కేంద్రం దాటవేత వైఖరి స్పష్టంగా కనిపిస్తుందనడాన్ని కాదనలేం. కేంద్రం ఈ వైఖరితో ఉన్నప్పుడు ఇద్దరు చంద్రులే ముందడుగు వేయవలసి ఉంటుంది. ఈ విషయంపై కేసీర్ ఇప్పటికే ఢిల్లీపై దండయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.కాగా చంద్రబాబు మాత్రం ఎప్పటిలాగే తనకు చాలా ఇష్టమైన నాన్చుడు ధోరణినే ప్రదర్శించడం శోచనీయం.. అలా హైకోర్టు విభజన అంశం రాజకీయ దురుద్దేశ్యాలతో పక్కదారి పడుతోంది.