వైఎస్‌ జగన్‌కి మార్కులు మైనస్సే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబుకి మార్కులేశారు. సున్నా మార్కులేయడం వివాదాస్పదమవుతోంది. చంద్రబాబుకి సున్నా మార్కులైతే వైఎస్‌ జగన్‌కి మైనస్‌ మార్కులే వస్తాయనే విమర్శలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఎందుకంటే, వైఎస్‌ జగన్‌ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు జారిపోయారు. ఇద్దరు ఎంపీలు కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీని వీడిపోయారు. ఓ రాజకీయ పార్టీకి, ఓ పార్టీ అధినాయకుడికి ఇంతకన్నా మైనస్‌ ఇంకేముంటుంది? అయినా రాజకీయాల్లో మార్కులు వేయాల్సింది ప్రజలు మాత్రమే. మేమే మార్కులేసేస్తాం అనే భ్రమలో ఉండడం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్‌ జగన్‌కి సరికాదు.

రెండేళ్ళలో ప్రతిపక్ష నేతగా సాధించింది ఏమిటి? అని జగన్‌ ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. ప్రజల్లోకి వెళ్ళడం ద్వారానే ప్రతిపక్షం బలోపేతమవుతుంది. రెండ్రోజుల దీక్షలు, మూడు రోజుల దీక్షలు పబ్లిసిటీకే పనికొస్తాయి.. ప్రజా సమస్యల పట్ల పోరాడాలి. ఆ పోరాటాలు నిత్యనూతనంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో పోరాటాలు చేయవలసి ఉంటుంది. ఫర్‌ ఎగ్జాంపుల్‌, నిత్యావసర వస్తువుల ధరలపై నిరంతర పోరాటమెక్కడ? రాజధాని రైతులకు అండగా ఉన్నదేదీ? కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ కుంభకోణాల్నీ పబ్లిసిటీకే వాడుకున్న జగన్‌. అధికార పక్షం బలోపేతమవుతోందంటే, అది ప్రతిపక్షం తాలూకు వైఫల్యం అని జగన్‌ గుర్తించేదెన్నడు? గుర్తించని పక్షంలో ప్రతిపక్ష హోదాని కూడా జగన్‌ కోల్పోవాల్సి రావొచ్చు. చంద్రబాబుని ఔట్‌ డేటెడ్‌ పొలిటీషియన్‌ అనే జగన్‌, తాను కూడా ఔట్‌ డేటెడ్‌ ఆలోచనలతోనే వ్యవహరించడం శోచనీయం.