విజయశాంతితో ‘ఒసేయ్‌ రాములమ్మ’ సీక్వెల్‌

అప్పట్లో విజయశాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఒసేయ్‌ రాములమ్మ’ సినిమా సెన్సేషన్‌ సృష్టించింది. తెలంగాణా ఉద్యమకారిణిలా విజయశాంతి తన నటనతో దుమ్ము రేపింది. దాసరి దర్శకత్వం చేస్తూ, నటించిన సినిమా ఇది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం స్టార్ట్‌ చేశారు ఇండస్ట్రీలో. ఎందుకంటే దాసరి నారాయణరావు, విజయశాంతితో ఈ సినిమాకు సీక్వెల్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఎప్పట్నుంచో ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కించాలనుకుంటున్నారు దాసరి. వేరే హీరోయిన్‌ని పెట్టి కూడా ఈ సినిమాను తీయాలనుకున్నారు. కానీ కుదరలేదు. అయితే ఇప్పుడు విజయశాంతితోనే ఈ సినిమాని మళ్లీ తెరకెక్కించాలని అనుకుంటున్నారట.

రాములమ్మ కూడా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అంతగా క్లారిటీ లేదు. తెలంగాణా ఉద్యమం నేపధ్యంలోనే ఈ సినిమా ఉండబోతోందట. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా ద్వారా సక్సెస్‌ పొందడం పక్కా అని దాసరి భావిస్తున్నారట. వేరే హీరోయిన్‌తో చేసినా సినిమాకి ఆ ఫ్లేవర్‌ ఉండదు. రాములమ్మ పాత్రకి విజయశాంతినే కరెక్ట్‌ అని నిర్ణయించుకున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి వివరాలు వెల్లడి చేయనున్నారు దాసరి నారాయణరావు. అయితే ఈ మధ్యకాలంలో దర్శకరత్న దర్శకత్వం వైపుగా ఆలోచనలు చేయడంలేదు. విజయశాంతి కోసమే ఆయన చాలాకాలం తర్వాత మెగాఫోన్‌ పట్టుకునే ఛాన్సుంది. ఇంకో వైపు నిర్మాతగా దాసరి నారాయణరావు పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది.