ముద్రగడ దీక్ష–పోస్టుమార్టం రిపోర్ట్

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన దీక్షతో అనుకున్నది సాధించారు. తుని విధ్వంసం కేసులో అరెస్టైన పదమూడు మంది విడుదలయ్యేదాకా తాను దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.వారికి బెయిల్ వచ్చి, విడుదలైన తర్వాతనే.. ఆయన బుధవారం నాడు దీక్షను విరమించారు. అనుకున్నది సాధించి, ప్రభుత్వం పైన పైచేయి సాధించినప్పటికీ… ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.అరెస్టైన వారి విడుదల కోసం ముద్రగడ పదమూడు రోజుల పాటు దీక్ష చేశారు.దీనిపై మంత్రులు, టిడిపి నేతలు పదేపదే ప్రశ్నలు సంధించడం గమనార్హం. ఇన్ని రోజుల పాటు ఆయన ఇలా ఎలా ఉండగలుగుతున్నారని వారు అనుమానం వ్యక్తం చేశారు.

అంతేకాదు, బెయిల్ వస్తుందని, కాబట్టి ముద్రగడ దీక్ష విరమిస్తారని ఐదారు రోజుల తర్వాతనే వార్తలు వచ్చాయి. వాటి వెనుక తెలుగుదేశం ఉందనే వాదనలు ఉన్నాయి. ఆయన దీక్ష విరమిస్తున్నారని, ఇన్ని రోజులు ఎలా ఉండగలుగుతున్నారని, ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.ఇది ముద్రగడ దీక్షలోని సీరియస్నెస్ను తగ్గించాయని అంటున్నారు. ముద్రగడ దీక్ష మరీ సాగిందని, ఇది కూడా టిడిపి వ్యూహమేనని అంటున్నారు. వీటన్నింటి కారణంగా దీక్ష ప్రభావం అంతగా కనిపించలేదనే వాదనలు కూడా ఉన్నాయి.

అదే సమయంలో, కాపు నేతలలో ఐక్యత లేకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ముద్రగడ దీక్ష అనంతరం మూడు నాలుగు రోజులకు గాని చిరంజీవి, దాసరి నారాయణ రావు వంటి నేతలు బయటకు రాలేదని అంటున్నారు. వైసిపి, కాంగ్రెస్ పార్టీ వైసిపి నేతలు వచ్చినా.. ప్రధానంగా రాజకీయ ప్రయోజనాలు కోసమే చూసుకున్నారని అంటున్నారు. చిరంజీవి, దాసరిలు ఒకటి రెండుసార్లు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం పైన వీరు పైచేయి సాధించినా… టిడిపి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ ప్రభావం కనిపించకుండా చేసిందని అంటున్నారు.

అంతేకాదు, చిరంజీవి, దాసరిలు బయటకు రాగానే అసలు.. మీరు కేంద్రమంత్రులుగా ఉన్నప్పుడు కాపులకు ఏం చేశారో చెప్పాలని టిడిపి నేతలు ఎదురు దాడి చేయడం గమనార్హం. మేం కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముందుకెళ్తున్నామని, కానీ వారు మాత్రం ఇప్పటికీ ఏం చేయలేదని చిరు, దాసరిలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలు చేశారు.