మారుతి స్కూల్లో చేరిన రాజ్‌తరుణ్‌ 

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ మారుతి స్కూల్‌లో చేరాడు. ఒకప్పుడు మారుతి సినిమాలంటే బూతు సినిమాలనే భావన ఉండేది. ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాతో ఇప్పుడు ఆ భావన పోయింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఉన్న కంటెన్ట్‌తో ఎంటర్‌టైన్‌ చేయగలడు అనే భావన కూడా ప్రేక్షకులకు కల్పించాడు. దాంతో యంగ్‌ హీరోస్‌ మారుతి కోసం క్యూ కడుతున్నారు. యంగ్‌ హీరోస్‌తోనే కాదు స్టార్‌ హీరోస్‌తో కూడా సినిమా చేయగలడు మారుతి అన్పించుకుంటున్నాడు. మారుతి ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌ ‘బాబు బంగారం’ చిత్రానికి దర్శకుడు. ఓ వైపు దర్శకుడిగా కొనసాగుతూనే ఇంకోపక్క సినిమాల్ని నిర్మిస్తూ, సినిమాలకు కథలు అందిస్తూ భిన్న పాత్రల్లో ఒదిగిపోతున్నాడు మారుతి.

నాని హ్యాండ్‌ బాగా కలిసొచ్చింది మారుతికి. వరుస హిట్స్‌తో హ్యాట్రిక్‌ అందుకున్న మరో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ సినిమాకి కూడా ఇప్పుడు మారుతి కథను అందిస్తున్నాడు. సినిమా టైటిల్‌ ‘రాజుగాడు’. దీనికి యమ డేంజర్‌ అనే ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘ఆడో రకం ఈడో రకం’ తర్వాత సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌, రాజ్‌ తరుణ్‌తో కలిసి చేస్తున్న సినిమా ఇది. హ్యాట్రిక్‌ కొట్టినాక రాజ్‌తరుణ్‌ కెరీర్‌ కొంచెం స్లో అయ్యింది. ఈ సినిమాతో నానికిచ్చినట్లు రాజ్‌తరుణ్‌కి కూడా మారుతి కథ హిట్‌ ఇస్తుందేమో చూడాలి. ఓ ప్రముఖ హీరోయిన్‌ ఇందులో నటించనుందట.