టాలీవుడ్ కి మల్లు భామల సెగ..

మలయాళ మందారాలంతా టాలీవుడ్ లో గట్టిగా పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో మలయాళి ముద్దుగుమ్మల హవా ఎప్పట్నుంచో నడుస్తుంది. టాలీవుడ్ లో కేరళకుట్టిలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నయనతార, అసిన్ లాంటి ముద్దుగుమ్మలు టాలీవుడ్ ను ఏలారు. ఇప్పుడు కూడా నిత్యామీనన్, అమలాపాల్ లాంటి భామలంతా మలయాళ కుట్టిలే. ఇక ఇప్పుడు తాజాగా మరో నలుగురు మలయాళ అందాలు తడిపేస్తున్నాయి. వాళ్లే మంజిమ మోహన్, కీర్తిసురేష్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్.

నేను శైలజతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కీర్తిసురేష్. ఇప్పటికే మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. రామ్ నేను శైలజలో శైలు పాత్రలో మెప్పించింది. కళ్ళతోనే మాయ చేసి.. తెలుగు ఇండస్ట్రీలో తాను స్టార్ హీరోయిన్ మాల్ అని మిగిలిన హీరోయిన్లకు సవాల్ విసిరింది కీర్తిసురేష్. మహేశ్, పవన్ సినిమాలను సైతం వదిలేసిన ఈ భామ.. నానితో ఓ సినిమాలో నటించబోతుందని సమాచారం. అంతేకాదు.. తమిళ్ లో విజయ్ 60వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది కీర్తిసురేష్.

మంజిమ మోహన్.. గౌతమ్ మీనన్, నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో పరిచయమవుతుంది ఈ బ్యూటీ. గతంలో ఏ మాయ చేసావేతో సమంత ఎంత మాయ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మంజిమ మోహన్ కూడా అదే స్థాయిలో మాయ చేస్తుందో లేదో చూడాలి. వీళ్ళతో పాటు అనుపమ పరమేశ్వరన్ అనే కొత్తమ్మాయి అ..ఆ సినిమాతో అడుగుపెట్టింది. ఇందులో చేసింది చిన్న పాత్రే అయినా.. తనదైన ముద్ర వేసింది అనుపమ. ప్రేమమ్ తో మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ బ్యూటీ.. ఆ సినిమా తెలుగు రీమేక్ ప్రేమమ్ లో నాగచైతన్యకు జోడీగా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు నివేదా థామస్ హార్ట్ త్రోబ్ గా మారింది. జెంటిల్ మన్ సినిమా చూసినోళ్లంతా ఈ బ్యూటీ ఎక్స్ ప్రెషన్ కు ఫిదా అయ్యారు. ఈ ముద్దుగుమ్మకు భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అంతే కాదు జంటిల్ మన్ సినిమాను నివేదా కోసం రెండో సారి కూడా చూస్తున్నారట.