జలజగడం-రాజకీయ ప్రయోజనాలే అజెండా!

ఎడ్డెం అంటే  తెడ్డెం.. అన్న చందాన తయారయ్యింది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం. నీటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన నీటి కేటాయింపులపై కేంద్రం వద్ద పంచాయితీ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మంత్రులు హరీష్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఒక్క చోట కూర్చుని చర్చించుకున్నారు. షరామామూలుగానే చర్చలు ఓ కొలిక్కి రాలేదు.  పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం, ఇద్దర్నీ ఓ చోట కూర్చోబెట్టిందిగానీ, ఏకాభిప్రాయాన్నయితే తీసుకురాలేకపోతోంది. ‘ముందు మీరు మాట్లాడుకోండి.. మీకు సయోధ్య కుదరకపోతే ఆ  తర్వాత ఆలోచిస్తాం..’ అన్నది కేంద్రం వాదన. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కలిసి ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా వున్నమాట వాస్తవం. రెండు రాష్ట్రాల్లోనూ వున్నది తెలుగు ప్రజలేనన్నదీ నిర్వివాదాంశం. ‘ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే వుందాం..’ అంటూ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనూ టీఆర్‌ఎస్‌ వాదించిందన్నదీ అందరికీ తెల్సిన విషయమే. వివాదాల్లేకుండా సమస్యను పరిష్కరించుకుందామని టీడీపీ చెబుతున్నదీ నిజమే.

ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల్ని పరిష్కరిస్తామని కేంద్రం చెబుతున్నదీ వాస్తవమే. అంతా బాగానే వుందిగానీ, సమస్యకి పరిష్కారమే దొరకడంలేదు. ఎందుకిలా.? ఇదే ఇప్పుడెవరికీ అర్థం కావడంలేదు. అసలు నీటి పంపకాల సమస్య ఓ కొలిక్కి వస్తుందా.? రాదా.? అన్నదానిపైనా స్పష్టత కన్పించడంలేదు. ఎవరో ఒకరు తగ్గితే తప్ప, సమస్యకు పరిష్కారం రాదు. ఇద్దరూ తగ్గితే ఇంకా మంచిది. కానీ, ఎవరూ తగ్గడంలేదు. అక్కడే వస్తోంది అసలు చిక్కు అంతా. పైకి మాత్రం, దేవినేని ఉమ తెలంగాణపైనా.. హరీష్‌రావు ఆంధ్రప్రదేశ్‌ మీదా మమకారం కురిపించేస్తున్నారు. ‘అందరం తెలుగువారమే..’ అని ఇద్దరూ చెబుతున్నారు. అలాంటప్పుడు, ఇద్దరూ ఎక్కడో ఓ చోట ఆగి, వెనక్కి తగ్గి సమస్యని పరిష్కరించేసుకుందాం.. అని ఎందుకు అనుకోరు.? ఇక్కడ మేటర్‌ క్లియర్‌. ఇరు రాష్ట్రాల్లోనూ సెంటిమెంట్లని రెచ్చగొట్టేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోందనీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోందనీ ప్రచారం చేసేశారు. ఓ రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి చెందిన నీటిని అక్రమంగా వాడేసుకుంటోందని ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీలూ హడావిడి చేయడం చూశాం. సో, ప్రజలు మానసికంగా దానికి కనెక్ట్‌ అయిపోయారనీ, ఆ కనెక్షన్‌ని అలాగే మెయిన్‌టెయిన్‌ చెయ్యాలనీ ఇప్పుడు మంత్రులు భావిస్తున్నారు. ఇదీ మెయిన్‌ పాయింట్‌.  ఇక్కడ, రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకీ తమ ప్రజల ప్రయోజనాలకన్నా, తమ తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. సో, రాజకీయ కోణంలోనే ఇరువురూ నీటి వివాదాన్ని చూస్తున్నారు. ఇంకేముంది, ఇది ఎప్పటికీ పరిష్కారం దొరకని సమస్యగానే మిగిలిపోనుంది దురదృష్టవశాత్తూ.