కోదండరామ్ పై గులాబీ దండయాత్ర

తెలంగాణ సర్కార్ తీరే వేరు. తమ వైఖరిని ప్రతిపక్షాలు ఎండగట్టినా పట్టించుకోదు. పైగా విపక్షనేతలపై తనదైన తరహాలో విరుచుకుపడుతుంది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తుతుంది. ఇలాంటి అధికార పార్టీ కోదండరామ్ తమను విమర్శించగానే అగ్గి మీద గుగ్గిలమైంది. అధిష్టాన పెద్దలతో పాటూ చిన్నాచితకా నేతలూ ఆయనపై ఫైర్ అయిపోతున్నారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి.

ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ తెలంగాణ ఏర్పడి ఎన్నికలు రాగానే ఫక్తు రాజకీయ పార్టీగా మారుతున్నామని ప్రకటించుకుంది. టీఆర్ఎస్ లక్ష్యం స్వరాష్ట్రాన్ని సాధించడమే అయినా… బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయమని అందుకే అధికారంలోకి రావాలనుకుంటున్నామని చెప్పింది. ఈ మేరకు అఖండ విజయం సాధించి అధికారం చేపట్టింది. రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందుల్లో పడేసింది. ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాలను నిర్వీర్యం చేసింది. దీంతో తనపై విమర్శలే లేకుండా చేసుకుంది. అయితే రాష్ట్రం ఏర్పడి రెండేళ్ల సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో హఠాత్తుగా విద్యావంతుల వేదికలో జేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పరిణామాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ప్రతిపక్ష పార్టీలు నిందలు వేస్తే పట్టించుకోని గులాబీ పార్టీ.. కోదండరామ్ విమర్శలకు స్పందిచడం సామాన్యులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

విపక్షాలు విమర్శిస్తే బంగారు తెలంగాణను అడ్డుకునేందుకు పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, ఓట్లకోసమే నీతిమాలిన పనులు చేస్తున్నారని టీఆర్ఎస్ విరుచుకుపడుతుంది. అయితే ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేని, ఓట్ల రాజకీయాలకు సంబంధం లేని కోదండరామ్ చేసే విమర్శలపై ప్రజలు ఆలోచిస్తారన్న భయం అధికార పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టిఆర్ఎస్ తో సమానంగా టీజేఏసీ కృషి చేసింది. తెలంగాణ లక్ష్యంగా పనిచేసిన టీజేఏసీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజల కోసం పోరాడుతూ ప్రభుత్వం పట్ల వాచ్ డాగ్ గా వ్యవహరిస్తానని ప్రకటించింది. రైతుల ఆత్మహత్యలు, కరువు సమస్యలు, ఉద్యోగుల విభజనపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తూ వచ్చింది. కానీ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. అయితే తాజాగా టీజేఏసీ గళం సవరించుకుంది. ప్రభుత్వ లోపాలపై విల్లు ఎక్కుపెట్టింది. కోదండరామ్ కు ప్రజల్లో విశ్వసనీయత ఉంది. ఉద్యమంలో పనిచేసిన నేతగా, రాజకీయాలకు సంబంధం లేని వేదికకు ఆయన నాయకుడు కావడంతో ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది. అంతా బావుందని తాము అంటుంటే…అదేం కాదు..అనేక ఇబ్బందులున్నాయని కోదండరామ్ చెప్పడం టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది.

తమ్ముడు తమ్ముడే…పేకాట, పేకాటే అన్నట్లు… టీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. ఉద్యమంలో కలిసి పనిచేసినంత మాత్రాన ఇప్పుడు తమను విమర్శిస్తే సహించేది లేదన్న తీరుతో టిఆర్ఎస్ నేతలు కోదండరామ్ పై ఎదురుదాడి మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే టీజేఏసీ లక్ష్యం నెరవేరిందని, ఇప్పుడున్న టీజేఏసీకి అర్ధమే లేదని అంటున్నారు. టీజేఏసీ నుంచి పార్టీలన్నీ బయటకు వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడున్న కమిటీ కార్యవర్గమేమిటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు కోదండరామ్ స్పష్టత ఇవ్వాలని, లేకపోతే తామింకా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కొందరు నేతలు ఓ అడుగు ముందుకేసి కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని ఆరోపిస్తున్నారు. కుబుసం విడిచిన విషనాగుగా అభివర్ణిస్తున్నారు. పాఠాలు చెప్పడం వేరు, పాలన చేయడం వేరు అంటూ ఆయన్ను ఎద్దేవా చేస్తున్నారు.

ఇన్ని రోజులు రాజకీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల విమర్శలను కూడా పట్టించుకోని అధికార పార్టీ కోదండరామ్ విమర్శలను మాత్రం సీరియస్ గా పరిగణించి, తమకు కోదండరామే అసలైన ప్రతిపక్షంగా చెప్పకనే చెప్తోంది. కోదండరామ్ చేసిన ఆరోపణలకు అధికార టీఆర్ఎస్ ఇంతగా స్పందించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.