ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. దేశంలోని అన్ని థియేటర్లలో ఆ రేట్లు తగ్గింపు..

భారతదేశంలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఆట క్రికెట్. ఆ తర్వాత అంత ఆదరణ సంపాదించుకుంది ఒక్క సినిమా రంగమే. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో మాత్రమే సినిమాల విడుదలను ఒక పండుగలా జరుపుకుంటుంటారు. ప్రజల ఆదరణని క్యాష్ చేసుకోవడం కోసం థియేటర్ల యజమానులు ఈ మధ్య చాలా ప్లాన్లే చేశారు. సినిమా టిక్కెట్‌కి అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా, అక్కడ దొరికే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాల ద్వారా సొమ్ము చేసుకోవాలని వారు అనుకున్నారు. దాంతో థియేటర్లపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

థియేటర్లలో దొరికే తినుబండారులపై కేంద్రం 18% వరకు జీఎస్టీ విధించింది. అది చాలదన్నట్టు థియేటర్ యాజమాన్యం కూడా తినుబండారాలపై ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది థియేటర్లలో లభించే తినుబండారాలపై పన్ను శాతం తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై విచారణ జరిపిన కౌన్సిల్ సభ్యులు నిన్న మంగళవారం జరిగిన 50 వ సమావేశంలో జీఎస్టీ ని తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు ఇండియాలోని అన్ని థియేటర్లలో, మల్టీప్లెక్సులలో స్నాక్స్‌పై 18 శాతం జీఎస్టీ ని వసూలు చేసారు. అయితే దానిని ఇప్పుడు 5 శాతానికి తగ్గిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే ఇది ఎప్పటి నుంచి అమలు అవుతుందనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. జిఎస్టి కౌన్సిల్ 50వ సమావేశం ముగిసిన తరువాత కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ ‘ థియేటర్లో దొరికే తినుబండారాలపై జీఎస్టీ ని 18% నుండి 5% తగ్గిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ స్పష్టం చేశారు. దీని గురించి పూర్తి సమాచారం త్వరలోనే అందిస్తాం.’ అంటూ ఆయన మాట్లాడారు. నిజానికి సినిమా ప్రియులకు ఇది ఒక పండుగ లాంటి వార్త అనే చెప్పాలి.